Hyderabad | బంజారాహిల్స్, ఆగస్టు 3: స్వలింగ సంపర్కులకు సంబంధించిన గే యాప్ ద్వారా పరిచయం చేసుకొని.. గదికి రప్పించుకొని దోపిడీలకు పాల్పడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్ ప్రాంతానికి చెందిన యువకుడు (23) ప్రైవేటు ఉద్యోగి. ఈనెల 1న అర్ధరాత్రి ప్రాంతంలో స్వలింగ సంపర్కులకు సంబంధించిన ‘గ్రిండర్’ యాప్లో చాటింగ్ చేస్తుండగా.. అఫ్రిదీ అనే యువకుడు పరిచయమయ్యాడు. తన గదికి రావాలని అఫ్రిదీ ఆహ్వానించడంతోపాటు లొకేషన్ కూడా పంపించాడు. దీంతో బంజారాహిల్స్ రోడ్ నంబర్- 12, బోళానగర్లోని అఫ్రిదీ గదికి వెళ్లిన బాధిత యువకుడిని కత్తితో బెదిరించి బట్టలు విప్పేయించాడు.
యువకుడిని నగ్నంగా వీడియో తీయడంతోపాటు అతడి వద్ద నుంచి వెండి బ్రాస్లెట్, గొలుసుతోపాటు రూ.2వేల నగదు కూడా లాక్కున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించాడు. బాధితుడు గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 392 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. చింతలబస్తీకి చెందిన మరో యువకుడిని కూడా అఫ్రిదీ ఇలాగే వేధించినట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు అఫ్రిదీ బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో రౌడీషీటర్ అని తేలింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.