Ayodhya | అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 22న మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని నలుగురు న్యాయ విద్యార్థులు బాంబే హైకోర్టు సవాల్ చేశారు. జస్టిస్ జేఎల్ కులకర్ణి, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఆదివారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ జరిపింది. శివంగి అగర్వాల్, సత్యజిత్ సిద్ధార్త్ సాల్వే, వేదాంత్ గౌరవ్ అగర్వాల్, ఖుసీ సందీప్ బంగియా అనే న్యాయ విద్యార్థులు ముంబయిలోని వేర్వేరు కాలేజీల్లో న్యాయశాస్త్రం చదువుతున్నారు.
ఏదైనా మతపరమైన కార్యక్రమాన్ని జరుపుకోవడానికి సెలవు దినంగా ప్రకటించడం రాజ్యాంగంలోని లౌకికవాద సూత్రాలను ఉల్లంఘించడమేనని పిటిషన్లో ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. భిన్న మతాలున్న దేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాస్తవానికి లౌకికవాద సూత్రాన్ని పెంపొందిస్తుందని వ్యాఖ్యానించింది. పబ్లిక్ హాలీడేస్ అంశంపై అనేక పూర్వాపరాలను ప్రస్తావిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ సెలవులు ప్రకటించడం ఎగ్జిక్యూటివ్ పాలసీ పరిధిలోనిదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది.
మతపరమైన కార్యక్రమానికి సెలవు ప్రకటించడం రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకికవాద సూత్రాలకు విరుద్ధంగా ఉందని.. రాష్ట్రం ఏదైనా నిర్దిష్ట మతాన్ని ఆమోదించకూడదని, అనుకూలంగా ఉండకూడదని వాదించారు. ఇలాంటి సెలవులతో విద్యాసంస్థలు, బ్యాంకింగ్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా సేవలను మూసివేయడంతో విద్యకు నష్టం, ఆర్థిక అవరోధాలు, పాలన, ప్రజావిధులకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత, దేశ అభివృద్ధి కనీసం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని పేర్కొన్నారు. పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలనే నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం చేయడమేననని పేర్కొన్నారు. అయితే, ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చుతూ పిటిషన్‌ను కొట్టివేసింది.