ముంబై : రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎంతో ఊరటనిచ్చే తీర్పును బొంబాయి హైకోర్టుకు చెందిన గోవా బెంచ్ శుక్రవారం వెలువరించింది. జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ (జేడీఏ) కింద చేపట్టే భవన నిర్మాణాలకు జీఎస్టీ వర్తించదని రూలింగ్ ఇచ్చింది. విక్రయపత్రం ద్వారా ఓ డెవలపర్ సదరు ఆస్తికి యజమాని అయిన వెంటనే జేడీఏ కింద చేపట్టే నిర్మాణ పనులకు జీఎస్టీ వర్తించదని పేర్కొంది.
ఈ తీర్పుతో హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో జేడీఏ ప్రాజెక్టులపై ఓ స్పష్టత రానుంది. పునరాభివృద్ధి ప్రాజెక్టుల్లో సైతం జీఎస్టీ విధింపును క్రమబద్ధం చేయడానికి ఈ తీర్పు దోహదపడనుంది. జేడీఏలపై పన్ను విధింపు విషయంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదానికి ఈ తీర్పుతో తెరపడింది.