Bomb call | చండీగఢ్‌లో జీ20 సన్నాహక సమావేశాల సందర్భంగా పోలీసులు హైరానాకు గురయ్యారు. ఒకవైపు వివిధ దేశాల ప్రతినిధులు వస్తుండగా.. మరోవైపు బాంబు కాల్ రావడంతో పోలీసులు ఆందోళనకు గురయ్యారు. జీ 20 సన్నాహక సమావేశాలు జరిగే వేదికకు సమీపంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో చండీగఢ్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబ్ డిస్పోజబుల్ బృందాలు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. బాంబు ఉన్నట్లు చెప్పిన ప్రాంతాన్ని పోలీసులు ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
మణిమజ్రాలోని హోటల్ లలిత్‌కు కొద్ది దూరంలో ఉన్న సెక్టార్-26లోని ఎస్సీఓ నుంచి బాంబు కాల్ వచ్చింది. బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్, అగ్నిమాపక దళం, లోకల్ పోలీసులు వెంటనే బాంబు ఉన్నట్లు చెప్పిన స్థలానికి చేరుకున్నాయి. పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించి వెతకడం ప్రారంభించారు. అయితే అక్కడ ఏమీ దొరకలేదని సమాచారం. మరోవైపు పేలుడు పదార్థం ఉన్నట్లు వచ్చిన కాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టినట్లు చండీగఢ్ పోలీసులు తెలిపారు. చండీగఢ్‌లో 2 రోజుల పాటు జరిగే జీ 20 సన్నాహక సమావేశాలకు హాజరయ్యేందుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హోటల్ లలిత్‌కు చేరుకున్నారు. ఇదే సమయంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా చండీగఢ్‌లోనే ఉన్నారు.
అంతకుముందు రిపబ్లిక్ డేకి ముందు కూడా సెక్టార్ 43 జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్లు పోలీసులకు లేఖ వచ్చింది. కారులో బాంబు ఉన్నదని, అది మధ్యాహ్నం 1 గంటకు పేలుతుందని లేఖలో పేర్కొన్నారు. దాంతో పోలీసులు అక్కడికి చేరుకుని చండీగఢ్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ మొత్తాన్ని ఖాళీ చేసి సీలు వేశారు. ఆపరేషన్ సెల్, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్, రిజర్వ్ ఫోర్స్ కమాండోలు కోర్టుకు చేరుకుని గాలింపు చేపట్టారు. చివరకు అది నకిలీ లేఖ అని పోలీసులు తేల్చడంతో అంతా ఊపిరిపీల్చారు.