కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై బాంబు దాడి జరిగింది. ఈ సంఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాంబు దాడిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Bomb Attack On BJP Workers) నాదియా జిల్లాలోని కరీంపూర్లో ఈ సంఘటన జరిగింది. గురువారం ప్రజా సంక్షేమ శిబిరంలో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలు తిరిగి వెళ్తుండగా సాహెబ్పారా ప్రాంతంలో వారిపై దాడి జరిగింది. కొందరు దుండగులు వారిపై బాంబులు విసిరి పారిపోయారు.
కాగా, బాంబు పేలుళ్లలో పలువురు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. తొలుత నదిడంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వారిని తరలించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బెర్హంపూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు రిఫర్ చేశారు.
మరోవైపు ఈ సమాచారం తెలిసిన వెంటనే థానర్పారా పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తల లక్ష్యంగా జరిగిన బాంబు దాడిపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలను రప్పించి ఆధారాలు సేకరించారు.
ఈ సంఘటన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉన్న నేరస్తులు ఈ దాడి చేసినట్లు స్థానిక బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని టీఎంసీ పేర్కొంది.