భువనేశ్వర్: స్కూల్ డ్రెస్‌లో ఉన్న బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. (School Girls Hanging From Tree) స్కూల్లో చదువుతున్న ఆ ఇద్దరు బాలికలు రెండు రోజుల కింద అదృశ్యమైనట్లు వారి తల్లిదంద్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 6న స్థానిక స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. స్కూల్ నుంచి వారు ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆ బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వారి కోసం అన్ని చోట్లా వెతికారు. కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, శనివారం స్కూల్ డ్రెస్‌లో ఉన్న బాలికల మృతదేహాలు అటవీ ప్రాంతంలోని చెట్టుకు వేలాడటాన్ని స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. బాలికల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.