BMC Polls : మరో మూడు రోజుల్లో ముంబై కార్పొరేషన్ (బీఎంసీ)కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి రసవత్తరమైన రాజకీయం నడుస్తోంది. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ఆస్తి, ఇతర వివరాలు బయటకొస్తున్నాయి. బీఎంసీ ఎన్నికల్లో బోలెడంత మంది కోటీశ్వరులు పోటీ పడుతున్నారు.
వారిలో అత్యధికంగా బీజేపీ అభ్యర్థి, న్యాయవాది అయిన మకరంద్ నర్వేకర్ ఆస్తి విలువ రూ.124కోట్లుగా ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత ధనవంతుడు ఈయనే. మకరంద్.. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ సోదరుడు కావడం విశేషం. మకరంద్ తోపాటు మరికొందరు కోటీశ్వరులు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. నర్వేకర్ కుటుంబానికి చెందిన హర్షిత నర్వేకర్ రెండో అత్యధిక ఆస్తి (రూ.63.62 కోట్లు) కలిగి ఉన్నారు. ఈమె స్పీకర్ కు మరదలు వరుస అవుతారు. అలాగే శివసేన ఎమ్మెల్యే సదా సావర్కర్ కుమారుడు సమాధాన్ సావర్కర్ శివసేన (యూబీటీ) నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన ఆస్తి విలువ రూ.46.59 కోట్లుగా ఉంది.
అలాగే.. ముంబై మాజీ మేయర్ శ్రద్ధా జాదవ్ కూడా పోటీ చేస్తున్నారు. ఆమె ఆస్తి విలువ రూ.46.4 కోట్లుగా ఉంది. ముంబైలో ఈ నెల 15న బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేయగా.. ప్రభుత్వం ఆ రోజు సెలవు ప్రకటించింది.