Omicron Effect : కొవిడ్-19 తాజా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ముంబై మరోసారి కరోనా హాట్ స్పాట్‌గా మారిన నేపధ్యంలో మహానగరంలో లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. లాక్డౌన్ వార్తలపై ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ శుక్రవారం క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో ముంబైలో లాక్డౌన్ ఉండదని, నగరంలో బెడ్ ఆక్యుపెన్సీ 20,000కు చేరితే నగరంలో లాక్డౌన్ అమల్లోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని..తుది నిర్ణయం సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీసుకుంటారని పేర్కొన్నారు. ముంబైలో కొవిడ్-19, ఒమిక్రాన్ కేసులు పెరిగినా పరిస్ధితిని ఎదుర్కొనేందుకు నగర యంత్రాంగం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. నగర ప్రజలు సైతం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.
మరోవైపు ముంబైలో ఒక్కరోజులోనే 20,000 కేసులు నమోదవడం కలకలం రేపింది. మహారాష్ట్రలో గురువారం 79 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తే ముంబైలోనే 57 కేసులు నమోదయ్యాయి. కేసుల పెరుగుదలతో బీఎంసీ శుక్రవారం తాజా కొవిడ్-19 మార్గదర్శకాలు జారీ చేసింది. స్వల్ప లక్షణాలతో బాధపడే రోగులు ఆస్పత్రులకు రాకుండా హోం ఐసోలేషన్ పాటించాలని కోరింది.