E-pharmacies| న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఔషధ విక్రయాల నియంత్రణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకువస్తున్నది. వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది. 80 ఏండ్ల నాటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్-1940 స్థానంలో డ్రగ్స్, మెడికల్ డివైజెస్ అండ్ కాస్మెటిక్స్ బిల్-2023ని తీసుకువస్తున్నది. త్వరలోనే ఇది కేంద్ర క్యాబినెట్ ముందుకు రానున్నది. ఔషధాలు, వైద్య పరికరాల ఉత్పత్తి, దిగుమతి, విక్రయాల నియంత్రణకు ఈ బిల్లును తీసుకువస్తున్నట్టు కేంద్రం తెలిపింది.
ఆన్లైన్లో ఔషధ విక్రయాల నియంత్రణకు, వాటిపై నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లు అనుమతిస్తుంది. ప్రభుత్వం అనుమతి లేనిదే ఏ ఒక్కరు కూడా ఆన్లైన్లో ఔషధాలను విక్రయించడానికి వీలుండదు. సంబంధిత భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపకుండానే ఈ ముసాయిదా బిల్లును పార్లమెంట్ ఆమోదానికి లిస్టింగ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ (ఏఐఎంఈడీ) ఇటీవల కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసింది. దీంతో తగిన సంప్రదింపులు జరిపిన తర్వాతే బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.