న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రవాద దాడి బాధితులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు, వారి వెనుక ఉన్న కుట్రదారులకు కఠినాతి కఠినమైన శిక్షలు పడతాయని స్పష్టం చేశారు. ఈ దాడికి సంబంధించిన చిత్రాలు, వీడియోలను చూసిన ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతున్నదన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆయన ప్రజలకు వినిపించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ఉగ్రవాదంపై నిర్ణయాత్మక పోరాటానికి మన ఐక్యతే ప్రాతిపదిక అని చెప్పారు. జమ్ముకశ్మీర్ సాధిస్తున్న పురోగతిని చూసి ఓర్వలేక.. అమాయకులపై ఉగ్రవాదులు దాడి చేశారని ఆరోపించారు.