న్యూఢిల్లీ, మే 21: సెలవుల్లో పనిచేయడానికి న్యాయవాదులు ఇష్టపడరని, కానీ కేసుల పెండింగ్‌కు న్యాయవ్యవస్థ నింద భరించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. వేసవి సెలవుల అనంతరం తమ పిటిషన్‌ను లిస్టింగ్ చేయాలంటూ ఒక న్యాయవాది పట్టుబట్టడంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మొదటి ఐదుగురు న్యాయమూర్తులు సెలవుల్లో కూడా కూర్చుని తమ విధులు కొనసాగిస్తున్నారని, అయినా పెండింగ్ కేసులపై న్యాయవ్యవస్థను తప్పుపడతారని, వాస్తవానికి సెలవుల్లో పనిచేయడానికి న్యాయవాదులే ఇష్టపడటం లేదని ధర్మాసనం పేర్కొంది. పాక్షిక న్యాయస్థాన పనిదినాల్లో రెండు నుంచి ఐదు వరకు వెకేషన్ బెంచ్‌లు పనిచేస్తున్నాయని, అందులో సీజేఐతో కూడిన ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు కూడా విధి నిర్వహణలో ఉంటున్నారన్నారు. అంతకుముందు కేవలం రెండు బెంచ్‌లు మాత్రమే సెలవు దినాల్లో పనిచేసేవని, సీనియర్ జడ్జీలు వచ్చేవారు కారని ఆయన తెలిపారు.