చండీఘఢ్ : పంజాబ్‌లో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ ప్రయాణిస్తున్న రహదారి ముట్టడిపై భారతీయ కిసాన్ యూనియన్ (క్రాంతికారి) వివరణ ఇచ్చింది. రహదారి ముట్టడిని కిసాన్ యూనియన్ అంగీకరిస్తూనే ఆ మార్గం నుంచి ప్రధాని మోదీ ప్రయాణిస్తారనే విషయం తమకు తెలియదని, ఇది యాధృచ్ఛికంగా జరిగిందని పేర్కొంది. రైతుల నిరసనలతో ఆ మార్గంలోని ఫ్లైఓవర్‌పై ప్రధాని కాన్వాయ్ బుధవారం 20 నిమిషాల పాటు నిలిచిపోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనను భద్రతా వైఫల్యంగా చెబుతున్నారు. దీంతో ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకుని భటిండా విమానాశ్రయానికి తిరుగుముఖం పట్టారు. ఫిరోజ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వెలుపల నిరసనలు చేపట్టేందుకు బల్దేవ్ సింగ్ జీరా నేతృత్వంలో బీకేయూ సభ్యులు ప్రదర్శనగా వెళుతుండగా ఫెరూషా అనాజ్ మండి వద్ద పోలీసులు నిలువరించారని బీకేయూ (కే) చీఫ్ ఉర్జిత్ సింగ్ ఫూల్ తెలిపారు.
మద్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ భటిండా నుంచి రోడ్డు మార్గంలో వస్తున్నారని పోలీసులు తమకు చెప్పారని అయితే ప్రధాని విమానంలో వస్తారని తాము భావిస్తూ తాము రోడ్డును క్లియర్ చేయలేదని చెప్పారు. తమను ఫిరోజ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్దకు వెళ్లనీయకుండా రోడ్డుపైనే నిరసనలు చేపట్టేందుకు అనుమతించారని అన్నారు. ఈ రూట్లో ప్రధాని వస్తారని పోలీసులు తమకు చెప్పలేదని, తమకు ఆ విషయం కూడా తెలియదని అందుకే తాము ఫ్లైఓవర్‌ను బ్లాక్ చేయడంతో పాటు ఫిరోజ్పూర్లో ప్రధాని ర్యాలీకి వెళుతున్న కొన్ని బస్సులను కూడా తాము అడ్డుకున్నామని చెప్పారు.