న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఎన్నికల హామీలపై కాషాయ పార్టీ నేత తేజీందర్ సింగ్ బగ్గా నిలదీశారు. అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట బీజేపీ యువమోర్చా చేపట్టిన నిరసనలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన బగ్గాపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
తాము ఎన్నికల్లో గెలుపొందితే పంజాబ్‌లో డ్రగ్ మాఫియాను అంతం చేస్తామని హామీ ఇచ్చిన కేజ్రీవాల్ ఈ దిశగా ఏం చర్యలు చేపట్టారని తేజీందర్ బగ్గా ప్రశ్నించారు. పంజాబ్‌లో ఖలిస్తానీ ఉగ్ర కుట్రలకు కేజ్రీవాల్ ఎప్పుడు తెరదించుతారని నిలదీశారు. తనపై ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా తాను పోరాడేందుకు సిద్ధమని ఓ వార్తా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
కాగా విద్వేష వ్యాఖ్యల కేసులో జులై 6 వరకూ బగ్గా అరెస్ట్‌ను నిలిపివేస్తూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకూ దర్యాప్తు చేపట్టవచ్చని బగ్గా స్టేట్మెంట్ను రికార్డు చేయాల్సి వస్తే ఢిల్లీలోని ఆయన నివాసంలో న్యాయవాది సమక్షంలో స్టేట్మెంట్ తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది.