పాట్నా: బీహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నిక పోరు నాటకీయ మలుపు తీసుకున్నది. నామినేషన్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత తన అభ్యర్థిని బీజేపీ ఆకస్మికంగా మార్చింది. జన సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌పై సాధారణ నేతను పోటీకి దించింది. (BJP’s Candidate Change) అభిషేక్ బంటీ స్థానంలో నీరజ్ కుమార్ సిన్హాను తమ అభ్యర్థిగా బీజేపీ శుక్రవారం ప్రకటించింది. దీంతో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రశాంత్ కిషోర్‌తో నీరజ్ కుమార్ సిన్హా తలపడనున్నారు.
కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నికైన తర్వాత బంకీపూర్ స్థానాన్ని ఖాళీ చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీకి కంచుకోట అయిన ఈ స్థానంలో పోటీ చేసే అభ్యర్థిగా తొలుత అభిషేక్ బంటీ పేరు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం సీఎం సమ్రాట్ చౌదరి, పార్టీ అగ్ర నేతల సమక్షంలో ఆయన అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.
అయితే శుక్రవారానికి పరిస్థితి మారిపోయింది. ‘వ్యక్తిగత కారణాల’ వల్ల ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నట్లు అభిషేక్ బంటీ వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సారావోగికి ఈ మేరకు లేఖ రాశారు. అలాగే మీడియా సమావేశంలో కూడా అదే కారణం చెప్పిన ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
మరోవైపు బీజేపీ ఆకస్మికంగా అభ్యర్థిని మార్చడంపై రాజకీయ ఊహాగానాలు మొదలయ్యాయి. మాజీ సీం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు పశుగ్రాసం కుంభకోణం కేసులో అభిషేక్ బంటీ తండ్రి రవీంద్ర ప్రసాద్ దోషిగా నిర్ధారణ కావడంతో మూడేళ్లు జైలు శిక్ష పడింది. దీంతో ప్రశాంత్ కిషోర్ ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు సంపాదించారు. ఎన్నికల ప్రచారంలో దీనిని ఒక ప్రధాన అంశంగా మార్చడానికి సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని దూకుడుగా లేవనెత్తుతారని, అది ఎన్నికల పరంగా, ప్రచార పరంగా బీజేపీకి నష్టం కలిగిస్తుందని ఆ పార్టీ భయపడింది. అందుకే ముందుజాగ్రత్త చర్యగా తన అభ్యర్థిని బీజేపీ మార్చినట్లు తెలుస్తున్నది. అభిషేక్ బంటీ స్థానంలో యువ, సాధారణ పార్టీ కార్యకర్త అయిన నీరజ్ కుమార్ సిన్హాను తమ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు.