న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి (Ramesh Bidhuri)కి ఆ పార్టీ అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. బీఎస్పీ ఎంపీని ఉద్దేశించి ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద ఎంపీ రమేష్‌ను రాజస్ధాన్‌లోని టోంక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్గా నియమించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ బరిలో ఉంటారని వార్తలు వచ్చిన నేపధ్యంలో బీజేపీ ఈ నియామకం చేపట్టింది.
టోంక్ నియోజకవర్గం సచిన్ పైలట్‌కు కంచుకోటగా చెబుతారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ తలపడనున్నాయి. మరోవైపు రాజస్ధాన్‌లో (Rajasthan Polls) అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆరోపించారు. మధ్యాహ్న భోజన పధకం, మైనింగ్ సహా ఎన్నో స్కామ్‌లతో కాంగ్రెస్ సర్కార్ భ్రష్టుపట్టిందని అన్నారు.
అశోక్ గెహ్లాట్ సర్కార్ అత్యంత అవినీతిమయ సర్కార్ అని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. యోజన భవన్‌లోని బేస్మెంట్లో కిలో బంగారం బయటపడిన నేపధ్యంలో రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు రంగంలోకి దిగడంతో 16 కిలోల బంగారం దొరికిందని, అవినీతిపై దర్యాప్తు సంస్ధలు చేపట్టినప్పుడల్లా సీఎం మొసలి కన్నీరు కారుస్తున్నారని, దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తున్నారని కేకలు పెడుతుంటారని దుయ్యబట్టారు. గెహ్లాట్ క్యాబినెట్ నుంచి ఇటీవల తొలగించిన రాజేంద్ర గుధ రెడ్ డైరీ గురించి వెల్లడించడాన్ని కేంద్ర మంత్రి ప్రస్తావించారు.
Read More :