BJP’s mission Bengal : ఈసారి ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్నే. మిషన్ బెంగాల్ అంటూ అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ పని చేసింది. టీఎంసీకి, మమతా బెనర్జీకి కంచుకోటగా ఉన్న బెంగాల్లో భారీ విజయం దిశగా బీజేపీ దూసుకుపోతోంది. 294 సీట్లున్న బెంగాల్లో బీజేపీ 192 సీట్లలో ఆధిక్యంలో ఉంది. టీఎంసీ దాదాపు 96 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తత రిజల్ట్ ట్రెండ్ ప్రకారం బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయం.
15 ఏళ్ల మమత సామ్రాజ్యం కూలడం కూడా ఖాయం. అయితే, 15 ఏళ్లుగా అధికారంలో ఉండి బెంగాల్‌ను ఒంటిచేత్తో శాసించిన మమతను ఓడించడానికి బీజేపీ ప్రత్యేక మిషన్ కొనసాగించింది. దాని ఫలితమే నేటి విజయం. బీజేపీకి బెంగాల్‌లోని ఉత్తర ప్రాంతంలో ఎప్పట్నుంచో మంచి పట్టు ఉంది. అయితే, ఈసారి దక్షిణ ప్రాంతంలో కూడా బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తోంది. అది కూడా టీఎంసీకి పట్టున్న ప్రాంతాల్లో ఆ పార్టీని ఓడిస్తోంది. ఇక బెంగాల్లో కీలక పట్టణాలైన కోల్‌కతా, హౌరా, హూగ్లి జిల్లాల్లో కూడా బీజేపీ సీట్లు గెలుచుకుంటోంది. 2021లో బెంగాల్లో బీజేపీ 77 సీట్లు మాత్రమే గెలుచుకుంది.
ఇప్పుడు మాత్రం ఆ సీట్లకు అదనంగా ఇంకో 120 సీట్ల వరకు పొందే ఛాన్స్ ఉంది. అంటే ఏ స్థాయిలో బీజేపీ పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వం వల్లే సాధ్యమైందని, వారి ప్రచారం బాగా కలిసొచ్చిందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. ఈసారి బీజేపీకి ఓట్ల శాతం కూడా పెరిగింది. తాజా ట్రెండ్ ప్రకారం బీజేపీకి 45 శాతం ఓట్లు పోలవ్వగా, టీఎంసీకి 40 శాతం ఓట్లు పోలయ్యాయి. 2021లో టీఎంసీకి 28,968,281 ఓట్లురాగా, బీజేపీకి 22,905,474 ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం దాదాపు 60 లక్షలు. అప్పట్లో టీఎంసీకి 48 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 38 శాతం ఓట్లు వచ్చాయి.
బీజేపీకి పార్టీపరంగానే కాకుండా, సిద్ధాంత పరంగా కూడా బెంగాల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయి. ఇదంతా బీజేపీ ఎన్నికల ఇంఛార్జి భూపేందర్ యాదవ్, విప్లవ్ కుమార్ దేవ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ శామిక్ భట్టాచార్య వల్లే సాధ్యమైందన్నది పార్టీ వర్గాల మాట.