Tamil Nadu : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 27 మందితో కూడిన జాబితాను శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఇందులో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు లేకపోవడం విశేషం. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. మైలపోర్ నుంచి, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్.. అవనాషి స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు.
అలాగే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్.. సత్తూర్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీయే కూటమిగా పోటీ చేయబోతుంది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ఎన్డీయే కూటమి తరఫున ఏఐఏడీఎంకే పార్టీ 169 స్థానాల్లో పోటీ చేయబోతుంది. బీజేపీ 27 స్థానాల్లో, అన్బుమణి రామదాస్ ఆధ్వర్యంలోని పీఎంకే పార్టీ 18 స్థానాల్లో, టీటీవీ దినకరన్ స్థాపించిన ఏఎంఎంకే పార్టీ 11 స్థానాల్లో పోటీ చేయబోతుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మే 4న ఫలితాలు వెల్లడవుతాయి. ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం మే 10న ముగుస్తుంది. మరోవైపు అధికార డీఎంకే కూడా సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్పీఏ) పేరుతో కూటమిగా పోటీ చేస్తోంది. ఈ కూటమిలో డీఎంకేతోపాటు, వామపక్షాలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఇతర చిన్న పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.
మరోవైపు నటుడు విజయ్ స్థాపించిన టీవీకే కూడా ప్రధాన పోటీదారుగా ఉండబోతుంది. ఈ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఇక, ఈ ఎన్నికల్లో నటుడు కమల్ హాసన్ స్థాపించిన ఎంఎన్ఎం పార్టీ పోటీ చేయడం లేదు. దీంతో ఇంతకాలం పార్టీలో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, వారు చెల్లించిన ఫీజు రూ.50 వేలను రీఫండ్ చేయాలని నిర్ణయించింది.