Bhupendra Patel | గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర భాయ్ పటేల్ రెండోసారి ప్రమాణం చేశారు. సోమవారం గాంధీనగర్లోని కొత్త సెక్రటేరియట్ భవనంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ దేవవ్రత్ ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం నూతన సీఎంగా భూపేంద్ర భాయ్ బాధ్యతలు తీసుకున్నారు. సీఎంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు, పలువురు బీజేపీ నేతలు హాజరైన కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.
భూపేంద్ర భాయ్ పటేల్.. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తాజా జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోనే బీజేపీ చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి పార్టీ అధిష్ఠానం ఆయనకే పాలనా పగ్గాలు అప్పజెప్పింది.
రెండు విడుతల్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 156 సీట్లను హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ 17 స్థానాలకే పరిమితమవగా, ఆప్ 5 స్థానాల్లో గెలుపొందింది. ఇక సీఎం భూపేంద్ర పటేల్.. అహ్మదాబాద్ జిల్లాలోని ఘట్లోడియా స్థానం నుంచి 1.92 లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.