Prashant Bhushan | కోల్కతా: లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఈసారి 200 సీట్లు కూడా దాటబోవని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వేశారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన సెంటిమెంట్ ఉందని సోమవారం కోల్కతాలో ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో మంగళసూత్రాలు, గేదెలు అంటూ ప్రధాని మోదీ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రశాంత్ స్పందిస్తూ.. ఈ ఎన్నికలు తన పట్టు నుంచి జారిపోతున్నాయని ప్రధాని మోదీ గ్రహించారని, అందుకే ఆయన నిరాశతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
అనేక కారణాల వల్ల బీజేపీకి వ్యతిరేకంగా దేశమంతా బలమైన సెంటిమెంట్ ఉందని, బీజేపీ ప్రజాస్వామ్యానికి ముప్పు అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపించడం, ప్రతిపక్షాలకు డబ్బు అందకుండా చేయడం వంటి వాటి వల్ల ప్రజల్లో బీజేపీపై చాలా కోపం ఉందన్నారు. బీజేపీ ప్రజాదరణ దిగజారడానికి ఆ పార్టీ చేస్తున్న మతపరమైన ప్రచారమూ కారణమేనన్నారు. ప్రజలు ఇలాంటి వాటిని ఇష్టపడరని, దేశాన్ని బలహీనపరిచేలా మతం ఆధారంగా దేశాన్ని చీల్చే ప్రయత్నంగా చూస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ ఈసారి రాబోదని, 200 సీట్లు దాటడానికే ఆ పార్టీ చాలా కష్టపడుతున్నదని చెప్పారు.