న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ ఓటర్లు బీజేపీ వైపు మళ్లారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఆ క్లారిటీ కనిపించింది. అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో కీలకమైన ఎస్సీ, ఎస్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నది. ఇక తమిళనాడు, పుదుచ్చరిలో కూడా ఎన్డీఏ కూటమి ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ స్థానాల్లో కీలక ప్రదర్శన ఇచ్చింది. అస్సాంలో 9 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. దీంట్లో బీజేపీ 5 గెలుచుకున్నది. ఇక ఎన్డీఏ కూటమికి మొత్తంగా 8 సీట్లు దక్కాయి. కేవలం ఒక్క సీటులో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఇక ఆ రాష్ట్రంలో 19 ఎస్టీ రిజర్వడ్ సీట్లు ఉన్నాయి. దీంట్లో బీజేపీ 13 చోట్ల విజయం సాధించింది. ఎన్డీఏ కూటమికి మిగితా సీట్లు వచ్చాయి. దీంతో 19 ఎస్టీ సీట్లు బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి.
అస్సాంలో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియ కూడా ఆ పార్టీకి కలిసివచ్చింది. ఎస్టీ స్థానాలు 16 నుంచి 19కి, ఎస్సీ స్థానాలు 8 నుంచి 9కి పెరిగాయి. బార్పెట, హజో సులకుచి, జాగిరోడ్, రాహ, బెహాలి, దోలాయి, రామ్ కృష్ణ నగర్, దిమోరియా ఎస్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నది. ఇక ఎస్టీకి చెందిన దోత్మా, కోక్రాజార్, గోల్పారా వెస్ట్, దుదాని, సిద్లి చిరాంగ్, బక్సా, తముల్పుర్, ఉదయ్గురి, దాకువఖానా, దేమాజీ, జోనాయి, మజులి, బోకాజాన్, హౌరాఘాట్, దీపు, రోంగ్ఖాన్, అమ్రి, హఫ్లాంగ్ స్థానాల్లో బీజేపీ గెలిచింది.
పశ్చిమ బెంగాల్లో కూడా రిజర్వడ్ స్థానాల్లో బీజేపీ విజయం కేతనం ఎగురవేసింది. ఆ రాష్ట్రంలో మొత్తం 68 ఎస్సీ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంట్లో బీజేపీ 51 సీట్లు గెలుచుకున్నది. అంటే 75 శాతం ఎస్సీ సీట్లు బీజేపీ వశమయ్యాయి. ఈ ఫలితాల ఆధారంగా బీజేపీకి దళిత సపోర్టు ఫుల్గా దక్కినట్లు తెలుస్తోంది. అయితే ఎస్సీ స్థానాల్లో టీఎంసీ కేవలం 17 సీట్లు మాత్రమే ఈసారి గెలిచింది. ఇక ఎస్టీకి చెందిన 16 నియోజకవర్గాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ కొట్టింది. నార్త్ బెంగాల్, జంగిల్మహల్కు చెందిన గిరిజన ప్రాంతాల్లో వంద శాతం ఎస్టీ ఓట్లను బీజేపీ తన బుట్టలో వేసుకున్నది. అయితే బెంగాల్లో ఓవరాల్గా 84 రిజర్వడ్ స్థానాల్లో 67 సీట్లను బీజేపీ గెలుచుకోవడం విశేషం. బెంగాల్లోని మథువా కమ్యూనిటీ .. ఏకపక్షంగా బీజేపీ వైపు మళ్లినట్లు ఓట్ల ద్వారా తెలుస్తోంది.