Rajya Sabha Election Results | న్యూఢిల్లీ, జూన్: వివిధ రాష్ర్టాల్లోని నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల్లో 24 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మొత్తం మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారులు గురువారం ప్రకటించారు. మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై వివాదం సుప్రీంకోర్టు ముంగిటకు చేరినప్పటకీ, ఇక్కడి ఫలితాన్ని రిటర్నింగ్ అధికారులు ప్రకటించి అభ్యర్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. మీనాక్షీ నటరాజన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనున్నది.
కాగా, పది రాష్ర్టాల్లో 27 రాజ్యసభ స్థానాలకు చేపట్టిన ఎన్నికలకు సంబంధించి 24 చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మీడియా సెల్ హెడ్ పవన్ ఖేరా, బీజేపీ నాయకులు సతీశ్ పూనియా, తరుణ్ చుగ్ తదితరులు ఉన్నారు.
ఎన్డీయే నుంచి 19 మంది అభ్యర్థులు, కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 3 స్థానాల్లో అభ్యర్థుల మధ్య పోటీ ఖరారైంది. జార్ఖండ్‌లోని రెండు స్థానాలకు, మిజోరాంలోని ఒక స్థానానికి జూన్ 18న ఎన్నిక నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు స్థానాల్ని ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంది. దీంట్లో ముగ్గురు టీడీపీ, ఒకరు జనసేన పార్టీకి చెందిన వారున్నారు.