(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం లేదా? సెఫాలజిస్ట్‌లు, ఆర్థిక నిపుణుల నుంచి సామాన్య ప్రజల వరకూ అందరిలోనూ ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తున్నది. గడిచిన 25 రోజుల్లో జరిగిన పరిణామాలు, ఏడు ప్రధానాంశాలను లోతుగా విశ్లేషిస్తే, మ్యాజిక్ ఫిగర్‌ను దాటడం బీజేపీకి కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తగ్గుతున్న పోలింగ్ శాతం
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకూ నాలుగు దశల పోలింగ్ ముగిసింది. అయితే, ఈ నాలుగు దశల్లోనూ 2019తో పోలిస్తే, తక్కువ ఓటింగ్ రికార్డవ్వడం అధికార బీజేపీని ఆందోళనకు గురిచేస్తున్నది. ఏప్రిల్ 19న జరిగిన తొలి దఫా పోలింగ్‌లో గతంతో పోలిస్తే 4 శాతం ఓటింగ్ తక్కువగా రికార్డయ్యింది. అదే నెల 26న జరిగిన రెండో దశలోనూ గతంతో పోలిస్తే 3 శాతం ఓటింగ్ తక్కువగా నమోదైంది.
దీంతో రెండు దశల పోలింగ్ ముగిసిన తరువాత ఎన్డీయే విజయం అంత కచ్చితం కాకపోవచ్చన్న అంచనాలు పెరుగసాగాయి. దీనికితోడు.. బీజేపీకి కీలకమైన ఉత్తరాది రాష్ర్టాల్లోనూ మోదీ గ్రాఫ్ పడిపోయిందన్న అభిప్రాయాలు బలపడ్డాయి. దీన్ని ధ్రువపరుస్తూ.. మే 7న జరిగిన మూడో దఫాలోనూ గతంతో పోలిస్తే పోలింగ్ రెండు శాతం వరకూ తగ్గింది. మే 13న జరిగిన నాలుగో దశలోనూ గతంతో పోలిస్తే పోలింగ్ 2.3 శాతం వరకూ తగ్గింది.
మార్కెట్లలో ప్రకంపనలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించబోతుందన్న నమ్మకం గతంలో మార్కెట్ వర్గాల్లో ఉండేది. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ అంచనాలు క్రమంగా తారుమారవ్వడం ప్రారంభించాయి. ముఖ్యంగా నాలుగు దఫాల్లో ఓటింగ్ శాతం గతంతో పోలిస్తే భారీగా తగ్గడంతో ఆ ప్రభావం మొత్తంగా మార్కెట్‌పై పడింది. దీంతో 25 రోజుల వ్యవధిలోనే సెన్సెక్స్ 2,500 పాయింట్ల వరకూ కోల్పోవాల్సి వచ్చింది. రూ. 25 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.
వీఐఎక్స్ హెచ్చరికలు
భారత స్టాక్ మార్కెట్లలో అస్థిరతను సూచించే ఇండియా వొలటాలిటీ ఇండెక్స్ (వీఐఎక్స్) గడిచిన తొమ్మిది సెషన్లలో ఏకంగా 67 శాతం పెరిగి.. 21.88 శాతానికి చేరుకొన్నది. ఇది 52 వారాల గరిష్ఠం. ఒకవిధంగా చెప్పాలంటే.. మార్కెట్లలో అస్థిరత్వం ఉన్నదని వీఐఎక్స్ డేంజర్ బెల్స్‌ను మోగించినట్టు భావించవచ్చు. మొత్తంగా.. బీజేపీకి ఈ ఎన్నికల్లో సీట్లు తగ్గుతాయన్న వార్తలు, ప్రభుత్వం మారే అవకాశమున్నదన్న వాదనలు బలపడటమే మార్కెట్లో ప్రకంపనలకు, వీఐఎక్స్ ఇండెక్స్ పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రసంగాల్లో అసహనం, విద్వేషం
మండిపోతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు, మరోవైపు ఆకాశాన్నంటిన నిత్యావసరాలు, ఇంకోవైపు తారాస్థాయికి చేరిన నిరుద్యోగం.. వెరసి పదేండ్ల బీజేపీ సర్కారు పాలనపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాని మోదీకి కూడా అనుమానాలు ప్రారంభమైనట్టు కనిపిస్తున్నది. అందుకే ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొంతకాలంగా ఆయన చేస్తున్న ప్రసంగాల్లో అసహనం, విద్వేషం కనిపిస్తున్నది.
‘కాంగ్రెస్ పార్టీ నాయకులు మన తల్లులు, చెల్లెళ్ల మంగళ సూత్రాలను కూడా వదలరు’ అని ఒకసారి.. ‘దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి (ముస్లింలకు) కాంగ్రెస్ పంచిపెడుతుం’దని మరోసారి.. ఇలా మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. బీజేపీకి సీట్లు తగ్గుతాయన్న ఆందోళనతోనే మోదీ వ్యాఖ్యల్లో అసహనం, విద్వేషం పాళ్లు పెరుగుతున్నట్టు రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
ఎన్డీయే కూటమి నేతలతో బలప్రదర్శన
ఏ వేదికపైనైనా, రాజకీయ కార్యక్రమంలోనైనా తాను మాత్రమే హైలైట్ కావాలని ప్రధాని మోదీ కోరుకొంటారు. విజయం సాధిస్తే, తనొక్కడిదే క్రెడిట్‌గా చెప్పుకొంటారు కూడా. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, మంగళవారం వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ.. ఎన్డీయే కూటమి నేతలతో, కేంద్రమంత్రులు, బీజేపీ సీఎంలతో బలప్రదర్శన చేశారు. తనకు సంఘీభావంగా ఎంతమంది వచ్చారో చూడండి అన్నట్టు ఫొటోలకు పోజిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయోనన్న భయంతోనే ప్రధాని ఇలా చేసుండొచ్చని, బీజేపీ ఒంటరికాదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఆయన ఇలా చేసి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కశ్మీర్లో పోటీకి దూరం
కశ్మీర్ లోక్‌సభ ఎన్నికల బరిలో ఏ ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా లేరు. గడిచిన మూడు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. కశ్మీర్లో మూడు లోక్‌సభ స్థానాలు ఉండగా, ఆ మూడింటిలోనూ బీజేపీ పోటీలో లేదు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని ఎన్నికల ప్రచారంలో గొప్పగా చెప్పుకొంటున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ అక్కడ పోటీచేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. కశ్మీరీ ప్రజలకు ఇచ్చిన ఉద్యోగ, ఉపాధి, భద్రత హామీలను నెరవేర్చకపోవడం, కశ్మీరీ పండిట్ల హత్యాకాండ వెరసి బీజేపీ గ్రాఫ్ అక్కడ దారుణంగా పడిపోయింది. కశ్మీర్ ఫలితాలు పార్టీకి నష్టం చేకూర్చవచ్చన్న ఉద్దేశంతోనే అక్కడ ఎన్నికల బరి నుంచి బీజేపీ తప్పుకొన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
విపక్ష నాయకులపై వేధింపులు
ఎన్నికలు దగ్గరపడుతున్న కీలక సమయంలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, జేఎంఎం నాయకుడు హేమంత్ సొరేన్ వంటి ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో మోదీ సర్కారు వేధింపులకు దిగింది. వారిని జైలుకు వెళ్లేలా చేసింది. ఎన్నికల్లో విపక్ష కూటమిని నిర్వీర్యం చేయడానికే అధికార పక్షం ఇలా కక్షపూరితంగా వ్యవహరించిందన్న విమర్శలు ఉన్నాయి.
బీజేపీ గ్రాఫ్‌పై అంచనాలు
ఈసారి అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఎన్డీయేకు రాబోదని, ఆ కూటమికి 268 సీట్లు కూడా దాటబోవని ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. మోదీ కరిష్మా, రామమందిర నినాదం ఈ ఎన్నికల్లో పనిచేయబోవని తేల్చిచెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దాటబోవని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వేశారు. దేశంలో యాంటీ బీజేపీ సెంటిమెంట్ బలంగా ఉన్నదని, ఆ పార్టీతో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందన్న భావన అందరిలోనూ ఉన్నదని వెల్లడించారు. ఇలా ఏడు అంశాలను విశ్లేషించిన అనంతరం.. రానున్న ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కు దూరంగానే ఆగిపోతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
లోక్‌సభలో మొత్తం సీట్లు: 543
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజారిటీ 272
ఈ ఎన్నికల్లో బీజేపీకి రాబోయే సీట్లు
(అంచనా)-200(ప్రశాంత్ భూషణ్),
233 (యోగేంద్ర యాదవ్)