నాపై జరిగిన దాడే అందుకు ఉదాహరణ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
వారణాసి: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని, తనపై జరిగిన దాడే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆమెను అడ్డుకోవడానికి కొందరు తీవ్రంగా ప్రయత్నించారు. ఒకానొక సందర్భంలో ఆమెపై దాడికి యత్నించారు. యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తరఫున ప్రచారం చేయడానికి మమతాబెనర్జీ బుధవారం అక్కడికి వెళ్లారు. తొలుత దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగాహారతిలో పాల్గొనడానికి వెళ్తుండగా కొందరు అడ్డుకున్నారు. నల్లజెండాలను చూపుతూ జైశ్రీరాం, మోదీ-మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో మమత కూడా అదే స్థాయిలో బదులిచ్చారు. జైహింద్, జైయూపీ అంటూ నినదించారు. ఈ సందర్భంగా కొందరు ఆమెపై దాడి చేయడానికి మీదికి దూసుకొచ్చారు. దీంతో సీఎం వ్యక్తిగత సిబ్బంది ఆమెకు రక్షణ కల్పించారు.
నన్ను నెట్టేశారు: బెనర్జీ
ఘటనపై మమత మాట్లాడుతూ ‘దశాశ్వమేధ ఘాట్ వద్దకు వెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు నా కారును అడ్డుకున్నారు. కారుపై దాడి చేశారు. నన్ను నెట్టేశారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేదాన్ని కాదు నేను. నేను ఫైటర్‌ను. వాళ్ల పప్పులు నా దగ్గర ఉడకవు. యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతున్నదనడానికి నాపై జరిగిన దాడే ఓ ఉదాహరణ’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం అత్యంత ప్రాధాన్య అంశమని, కానీ ప్రధాని మోదీ మాత్రం యూపీ ఎన్నికల్లో బిజీబిజీగా గడుపుతున్నారని మమత ధ్వజమెత్తారు. మరోవైపు ఈ దాడిని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో విడుత పోలింగ్ గురువారం జరిగింది. 55.79 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విడుతలో 57 సీట్లకు ఎన్నికలు జరిగాయి.