కుర్సియాంగ్: ఒకవేళ పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, దశాబ్ధాల కాలం నాటి గుర్కా సమస్యను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) పేర్కొన్నారు. బీజేపీ ఒక్కటే గోర్కా సమస్యను పరిష్కరించగలదని, మరే పార్టీ కూడా ఆ సమస్యను పరిష్కరించలేదన్నారు. డార్జిలింగ్ జిల్లాలోని కుర్సియాంగ్లో జరిగిన ఎన్నికల సభలో మంత్రి షా మాట్లాడారు. గోర్కాల మనోభావాలను, ఆందోళనలను బీజేపీ మాత్రమే అర్థం చేసుకోగలదని, వారికి తగినట్లే ఆ సమస్యను పరిష్కరించగలమని అమిత్ షా తెలిపారు.
తమ ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెళ్లలోనే గోర్కాల ముఖంలో ఆనందాన్ని చూడవచ్చు అన్నారు. గోర్కాల సమస్యకు పరిష్కారాన్ని గుర్తిస్తామని, గోర్కాలు శాంతియుతంగా జీవించవచ్చు అన్నారు. ఉత్తర బెంగాల్లో ఉన్న కొండ ప్రాంతాల్లో ఎక్కువగా గోర్కా వర్గ ప్రజలు నివసిస్తుంటారు. అయితే తమ సమస్యలు పరిష్కరించాలని ఆ కమ్యూనిటీ కొన్ని దశాబ్ధాలు నుంచి పోరాడుతూనే ఉన్నది.
కేంద్ర మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో ఎక్కడా నేరుగా గోర్కాల్యాండ్ కానీ ప్రత్యేక రాష్ట్రం గురించి కానీ ప్రస్తావించలేదు. కానీ డార్జిలింగ్ లోక్సభ స్థానం ప్రస్తుతం బీజేపీ ఆధినంలో ఉన్నది. 2009 నుంచి అక్కడ ఆ పార్టీయే గెలుస్తోంది.