కూచ్ బెహార్: భారతీయ జనతాపార్టీ (BJP) దేశాన్ని అమ్మాలనుకుంటోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి విమర్శించారు. ఇప్పటికే పలు ప్రభుత్వరంగ యూనిట్లలో వాటాలను బీజేపీ సర్కారు అమ్మేసిందని ఆరోపించారు. ఇవాళ కూచ్ బెహార్లో జరిగిన ఓ కార్యక్రమంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు.
‘బీజేపీ అగ్రనేతలు ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లినా తమను గెలిపిస్తే డబుల్ ఇంజిన్ సర్కారు (కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం) ఏర్పాటవుతుందని, దాంతో అభివృద్ధి వేగవంతమవుతుందని చెప్పుకుంటారు. కానీ త్వరలో వాళ్ల డబుల్ ఇంజిన్ తుడిచిపెట్టుకుపోనుంది’ అని మమతాబెనర్జి వ్యాఖ్యానించారు.
పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికలతో వాళ్లు ఒక ఇంజిన్ కోల్పోతారని, 2024 లోక్సభ ఎన్నికల్లో రెండో ఇంజిన్ కోల్పోతారని మమత జోస్యం చెప్పారు. దేశంలోని బీజేపీని గద్దెదించడం కోసం మహా కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో మహా కూటమి ఏర్పడుతుందని, బీజేపీనీ ఓడిస్తుందని ఆమె తెలిపారు.