
న్యూఢిల్లీ : మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. 60 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ హెయిన్గాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ అధికారికంగా ప్రకటించారు. మణిపూర్లో బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన సంగతి తెలిసిందే. మొదటి దశ ఎన్నికలకు ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 8వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 11 కాగా, 27న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో దశ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 11 కాగా, 16వ తేదీ లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. రెండో దశ పోలింగ్ మార్చి 3న నిర్వహించనున్నారు. ఫలితాలు మార్చి 10న వెల్లడి కానున్నాయి. మణిపూర్లో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.