కోల్కతా : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారుల మధ్య ఏర్పడిన వివాదం తీవ్ర విధ్వంసానికి దారితీసింది. కోల్కతాలోని సఖేర్బజార్, బెహలా పశ్చిమ ప్రాంతాల్లో ఇరు పార్టీల వారు దహనం, విధ్వంసానికి పాల్పడటంతో పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధిక శబ్దంతో మైకులు వాడటంపై సఖేర్బజార్లో తొలుత ఈ గొడవ ప్రారంభమైంది.
తాము సమావేశాన్ని నిర్వహించుకుంటుండగా, టీఎంసీ కార్యకర్తలు వచ్చి పెద్ద శబ్దంతో సంగీతాన్ని పెట్టి ఆటంకపర్చడమే కాక, సభా ప్రాంగణంలో వారి పార్టీ జెండాలను పాతారని బీజేపీ ఆరోపించింది. అయితే టీఎంసీ నేత సుదీప్ పోలీ నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో బీజేపీ విధ్వంసానికి పాల్పడిందని టీఎంసీ ఆరోపించింది. దీనికి ప్రతీకారంగా వారు బీజేపీ సమావేశం జరుగుతున్న వేదికకు నిప్పు పెట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. మంటలను అదుపులోకి తెచ్చామని, పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు.