న్యూఢిల్లీ, ఏప్రిల్ 12 : పార్టీ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు బీజేపీ ఆదివారం విప్ జారీచేసింది. ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని, ఈ సమయంలో పార్టీ ఎంపీల్లో ఎవరికీ సెలవు మంజూరు చేయటం లేదని పేర్కొంటూ మూడు లైన్లతో కూడిన విప్ జారీ చేసింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ సవరణ బిల్లును గత బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది.
ఈ బిల్లును ఆమోదింపజేసేందుకు బడ్జెట్ సమావేశాల్ని పొడిగించి, ఏప్రిల్ 16 నుంచి 18 వరకు ప్రత్యేక సమావేశాల్ని కేంద్రం నిర్వహిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం హడావిడిగా తీసుకొస్తున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఖర్గే కేంద్రాన్ని డిమాండ్ చేశారు.