జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఏం మాట్లాడినా… అందుకు బీజేపీ బాధ్యత వహించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. గతంలో బీజేపీ మెహబూబా ముఫ్తీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, అందుకే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మెహబూబా ముఫ్తీ పార్టీ స్థాపించినప్పటి నుంచీ వేర్పాటువాదులకు మద్దతిస్తూనే వుందని, అయినా బీజేపీ ఆమెతో పొత్తు పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. మెహబూబా ముఫ్తీని, ఆమె పార్టీ పీడీపీని బలోపేతం చేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. అందుకే ఆమె చేసే వ్యాఖ్యలకు పూర్తి బాధ్యత బీజేపీ తీసుకోవాలి. ఆమెతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆమె బీజేపీకి దగ్గరి మిత్రురాలు. మెహబూబా ఎప్పుడూ పాక్‌ను సమర్థిస్తుందని వారికి తెలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జమ్మూ కశ్మీర్ విషయంలో బీజేపీ ఎలాంటి అభిప్రాయాలతో వున్నా.. మేము మాత్రం మెహబూబా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూనే వుంటాం అని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.
కశ్మీర్ ఓ వివాదాంశం : మెహబూబా
జమ్మూ కశ్మీర్ అంశం ఓ వివాదాస్పదమైన అంశమని పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. గత 70 సంవత్సరాలుగా ఈ వివాదాంశం కొనసాగుతూనే వుందన్నారు. పాక్ ప్రజలు, జమ్మూ కశ్మీర్ ప్రజలు చర్చలు జరుపుకుంటూనే దీనికి ఓ ముగింపు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.