లక్నో: భారతీయ జనతాపార్టీపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ అంటే అహంకారం, అబద్దాలు, ద్రవ్యోల్బణమేనని మండిపడ్డారు. శనివారం అజాంగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అంటే జిన్నా, అజాంఖాన్, ముఖ్తార్ అన్సారీ అని వ్యాఖ్యానించారు. ఆ ముగ్గురి పేర్లకు కలిపి జామ్ (JAM) అనే అబ్రివేషన్‌ను కూడా ఇచ్చారు.
దేశంలోని ప్రతి పౌరుడికి జనధన్ ఖాతా (J), ఆధార్‌కార్డు (A), మొబైల్ నంబర్ (M) తప్పనిసరిగా ఉండాలని చెబుతూ ఈ JAM అనే అబ్రివేషన్‌ను వినియోగించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా సమాజ్‌వాది పార్టీని విమర్శిస్తూ.. జిన్నా (J), అజాంఖాన్ (A), ముఖ్తార్ (M) అనే పేర్లను JAM అని ప్రస్తావించారు. అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్‌గా అఖిలేష్ యాదవ్ తాజా విమర్శలు చేశారు. బీజేపీ అంటే జూట్ (J, అబద్దాలు), అహంకార్ (A, అహంకారం), మహంగాయ్ (M, ద్రవ్యోల్బణం) అంటూ JAM అనే అబ్రివేషన్ వచ్చేలా కౌంటర్ ఇచ్చారు.