Praja Poll Survey : పశ్చిమబెంగాల్ (West Bengal) లో బీజేపీ జయకేతనం ఎగురవేయబోతున్నదని ఓ ప్రీపోల్ సర్వే (Pre poll survey) లో వెల్లడైంది. ప్రజాపోల్ అనలిటిక్స్ సంస్థ (PPA) చేసిన సర్వేలో బెంగాల్ ప్రజలు బీజేపీకే పట్టంగడుతారని తేలింది. మొత్తం 294 స్థానాలకుగాను బీజేపీ 167 స్థానాల వరకు గెలుచుకుని అధికారంలోకి రావడం ఖాయమని ప్రజాపోల్ సర్వే (Praja Poll Survey) సంస్థ తెలిపింది. అయితే పశ్చిమబెంగాల్లో గత మూడు పర్యాయాలుగా అంటే వరుసగా 15 ఏళ్లుగా అధికారం చెలాయిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (Trinamul Congress) నాలుగోసారి కూడా విజయం తమదేనన్న ధీమాతో ఉన్నది.
ప్రజాపోల్ సంస్థ సర్వే ప్రకారం.. పశ్చిమబెంగాల్లో ప్రతిపక్ష బీజేపీ 167 సీట్లు గెలుచుకోబోతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 126 స్థానాలకే పరిమితమవుతుంది. ఇతరులు కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ప్రజాపోల్ సంస్థ ప్రీ పోల్ సర్వే ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో బెంగాల్ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. బెంగాల్ ఈసారి బీజేపీ ప్రభుత్వం పక్కా అని ధీమా వ్యక్తంచేస్తోంది. అందుకు అనుగుణంగానే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా అగ్రనేతలంతా బెంగాల్లో బీజేపీ గెలుపు కోసం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
అయితే అధికార తృణమూల్ కాంగ్రెస్ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నది. ఇప్పటికే వరుసగా మూడుసార్లు గెలిచిన తృణమూల్ నాలుగోసారి గెలుపు తమదేనని చెబుతోంది. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను మళ్లీ గెలిపిస్తాయని అంటోంది. బీజేపీ కుట్రలు, ఆటలు బెంగాల్ ప్రజల దగ్గర పనిచేయవని, బెంగాల్ బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదని చెబుతోంది. కాగా ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న బెంగాల్లో ఇప్పడు వామపక్షాల ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది. వాళ్లు కింగ్‌లు కాకపోయినా, కనీసం కింగ్ మేకర్లు అయ్యే పరిస్థితి కూడా లేకుండా పోయింది.