న్యూఢిల్లీ: ఈ నెలాఖరులోగా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. కొత్త అధ్యక్షుడి నియామకం తరువాత కేంద్ర క్యాబినెట్ విస్తరణతోపాటు మార్పులు చేర్పులను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కావడం, అదే సమయంలో పార్టీ అగ్ర నేతలు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో గంటలపాటు సమాలోచనలు జరపడంతో క్యాబినెట్ విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి.
16న ప్రధాని మోదీ సమక్షంలో పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో బీజేపీ అగ్ర నాయకత్వం మరో సమావేశం నిర్వహించింది. ఈ వరుస సమావేశాల అజెండా బయటపడనప్పటికీ పార్టీ తదుపరి అధ్యక్షుడి నియామకంలో జరుగుతున్న జాప్యం, మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో వీటికి ప్రాధాన్యం ఏర్పడింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఈ ఏడాది జనవరిలోనే జరగవలసి ఉండగా పార్టీని మరింత బలోపేతం చేయగల నాయకుడిని జాగ్రత్తగా ఎంపిక చేసేందుకే ఈ జాప్యమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 2020 జనవరి నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ నడ్డా పదవీకాలాన్ని మూడేళ్ల గడువుకు మించి పార్టీ పొడిగించింది. మరో వారం లేదా రెండు వారాల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి ప్రకటన వెలువడొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారిలో కేంద్ర మంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్ ఉన్నారు.
తాను రాజకీయాలను ఫుల్‌టైం జాబ్‌గా పరిగణించడం లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల పేర్కొన్నారు. ప్రధాని మోదీ రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని, భావి ప్రధాని యోగి ఆదిత్యనాథేనని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఇదే విషయాన్ని మీడియా ప్రస్తావించగా ఆయన పైవిధంగా స్పందించారు. ‘చూడండి, నేను ఈ యూపీ రాష్ర్టానికి సీఎంని. ప్రజలకు సేవ చేసేందుకు పార్టీ నన్నిక్కడ నియమించింది. రాజకీయాలు నా పూర్తి వ్యాపకం కాదు. ప్రస్తుతం నేను ఇక్కడ సీఎంగా ఉన్నాను. కానీ వాస్తవానికి నేనొక యోగిని’ అని పేర్కొన్నారు.