Delhi BJP : ఢిల్లీ (Delhil) అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన బీజేపీ.. కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Vinay Kumar Saxena) ను కలిసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ (Virendra Sachdeva) లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, సిటీకి చెందిన లోక్‌సభ ఎంపీలు సాధ్యమైనంత తర్వగా మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటున్నారని, మీ వీలు చూసుకుని అప్పాయింట్మెంట్ ఇవ్వాలని ఆ లేఖలో సచ్దేవ కోరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను ఓడించి 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ ఆధికార పగ్గాలు చేపట్టబోతోంది. 70 అసెంబ్లీ స్థానాలకుగాను మెజారిటీకి అవసరమైన 36 స్థానాలు సాధించడంలో ఆప్ విఫలమైంది. కేవలం 22 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 48 సీట్లతో అధికారం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సమాయత్తమైంది. ఎల్జీని అప్పాయింట్మెంట్ ఇవ్వగానే ఆయనను కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.
అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన నుంచి తిరిగి రాగానే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కొత్త సీఎంగా ఎవరిని అధిష్ఠానం ఎంపిక చేస్తుందనే అంశంపై ప్రస్తుతం ఊహాగానాలు నడుస్తున్నాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ తనయుడు పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌పై పర్వేష్ వర్మ గెలుపొందారు.
గత పదేళ్లలో ఢిల్లీలో బీజేపీ ఓటింగ్ షేర్ 13 శాతం పెరిగింది. ఆప్ ఓటింగ్ షేర్ 10 శాతం తగ్గింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఆప్ మధ్య కేవలం 2 శాతమే ఓట్ షేర్ వ్యత్యాసం ఉంది. బీజేపీ ఓటింగ్ షేర్ 45.56గా ఉండగా, ఆప్ ఓటింగ్ షేర్ 43.57 శాతంగా ఉంది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోనప్పటికీ ఓటింగ్ షేర్ 6.34గా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 2.1 శాతం ఓటింగ్ షేర్ కంటే ఇప్పుడు పెరగడం విశేషం.