Karnataka | బెంగళూరు, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీపై కర్ణాటక ‘కాఫీనాడు’ తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. కాఫీ పంటకు బీమా కల్పించడం, ధరల అస్థిరత తదితర సమస్యలను పరిష్కరించాలని ఏండ్లుగా మొరపెట్టుకొంటున్నా కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కాఫీ పంట రైతులు మండిపడుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తగిన విధంగా బుద్ధి చెప్తామని కాఫీ రైతులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొన్నది. కొడగు, హసన్, చిక్కమగళూరు జిల్లాల్లోని 10 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో కాఫీ తోటలు అధికంగా ఉంటాయి.
ఈ పదికి గానూ 8 స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ దాదాపు 2.05 లక్షల రైతులు, 20 లక్షల మంది వరకు కాఫీ కార్మికులు ఉంటారు. కాగా, ఆయా నియోజకవర్గాల్లో కాఫీ రైతులకు గట్టి పట్టు ఉన్నది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శక్తి ఉన్నది. కాఫీ పండే ప్రాంతాల పరిధిలో 10 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నప్పటికీ, తమ సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేందుకు ప్రయత్నం చేసిన పాపాన పోలేదని రైతులు మండిపడుతున్నారు.
రైతులకు బ్యాంకుల నోటీసులు
ఇతర పంటల్ని సాగు చేసే రైతుల మాదిరిగా కాఫీ రైతులు పంటల బీమాకు అర్హులు కాదు. ఎకరా పంటకు 6-7 లక్షల వ్యయం అవుతుంది. నష్టం వస్తే జాతీయ ప్రకృతి వైపరీత్యాల పరిహార నిధి కింద వీరికి ఎకరానికి వచ్చే పరిహారం కేవలం రూ.56 వేలు. మరోవైపు పంటల నష్టంతో రుణాలను చెల్లించకపోవడంతో బ్యాంకుల నోటీసులు ఇస్తున్నాయని కర్ణాటక కాఫీ ఉత్పత్తిదార్ల సమాఖ్య అధ్యక్షుడు జయరాం ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే, బీజేపీకి తగిన బుద్ధి చెప్తామని పేర్కొన్నారు.