Dinesh Sharma : కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో కేంద్ర ప్రభుత్వం సహా బీజేపీ, ఆరెస్సెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించడం పట్ల కాషాయ నేతలు భగ్గుమన్నారు. విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించడం రాహుల్‌కు అలవాటుగా మారిందని మండిపడుతున్నారు. ఇక రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ దినేష్ శర్మ గురువారం స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భారత్ ఎకానమీ ప్రపంచంలో 11వ స్ధానంలో ఉండగా ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద 5వ ఎకానమీగా ఎదిగిందని అన్నారు.
త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్ అవతరించనుందని పేర్కొన్నారు. రక్షణ రంగంలో భారత్ ప్రస్తుతం ఆయుధాలు తయారుచేస్తోందని, భారత్ ఎడ్యుకేషన్ హబ్‌గా ఎదిగిందని, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల విద్యార్ధులు ఇక్కడికి చదువుకునేందుకు వస్తున్నారని శర్మ వివరించారు. మనం సొంతంగా కొవిడ్ వ్యాక్సిన్‌ను తయారుచేశామని ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేశామని గుర్తుచేశారు. భారత్ పలు రంగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరుస్తుంటే రాహుల్ గాంధీ మాత్రం విదేశీ పర్యటనల సందర్భంగా తన అసహనం వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు.
మీరెందుకు అంత అసహనానికి లోనవుతున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి రావాలనే అసహనం మీలో ఎందుకు పెరిగిపోతున్నదని బీజేపీ ఎంపీ దినేష్ శర్మ రాహుల్ గాంధీని నిలదీశారు. కాగా, రాహుల్ గాంధీ పార్లమెంట్లో విపక్ష నేతని, దేశం బయట ఆయన భారత ప్రతిపక్ష నేత కాదని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె అన్నారు. దేశం వెలుపల మనమంతా ఒక్కటేనని, ఆయన ఇలా ఎందుకు అర్ధం చేసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. భారత్ ప్రతిష్టను మసకబార్చడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటని నిలదీశారు.
Read More :
Vinesh Phogat | నాలుగు లగ్జరీ కార్లు.. రూ.కోట్ల ప్రాపర్టీ.. వినేశ్ ఫోగట్ ఆస్తుల వివరాలు ఇవే..