Vinesh Phogat | భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆరు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే నెలలో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం (Julana Assembly Constituency) నుంచి పోటీకి దిగారు. ఆ స్థానానికి బుధవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల (Assents) వివరాలను వినేశ్ ప్రకటించారు.
ఆ అఫిడవిట్ ప్రకారం.. వినేశ్‌కు రూ.4 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. సోనిపత్‌లో రూ.2 కోట్లు విలువ చేసే స్థిరాస్తి ఉంది. తన వద్ద మొత్తం మూడు లగ్జరీ కార్లు ఉన్నట్లు వినేశ్ తన అఫిడవిట్లో వెల్లడించారు. రూ.35 లక్షల విలువైన వోల్వో ఎక్స్‌సీ 60, రూ.12 లక్షల విలువైన హ్యుందాయ్ క్రెటా, రూ.17 లక్షల విలువైన టయోటా ఇన్నోవా ఉన్నట్లు తెలిపారు. ఇన్నోవా కారు కోసం రూ.13 లక్షల రుణం తీసుకున్నానని.. ప్రస్తుతం దాన్ని చెల్లిస్తున్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారు.
ఇవేకాకుండా తన భర్త సోమ్‌వీర్ రాథీ పేరు మీద రూ.19 లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో కారు ఉన్నట్లు వెల్లడించారు. ఇక ప్రస్తుతం తన చేతిలో రూ.1.95 లక్షల నగదు ఉన్నట్లు వినేశ్ తెలిపారు. మూడు బ్యాంకుల్లో ఇద్దరి (వినేశ్, ఆమె భర్త సోమ్‌వీర్) పేర్లమీద మొత్తం రూ.69 లక్షల డిపాజిట్లు ఉన్నట్లు వినేశ్ వెల్లడించారు. తన వద్ద 35 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి.. భర్త వద్ద 28 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి ఉన్నట్లు వినేశ్ తెలిపారు.
కాగా, గత వారం బజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో వినేశ్‌కు వ్యతిరేకంగా.. బీజేపీ తరపు నుంచి కెప్టెన్ యోగేశ్ బైరాగీ పోటీపడనున్నారు. వచ్చే నెలలో హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
Killer wolfs | ఒంటరి తోడేలు కోసం కొనసాగుతున్న గాలింపు.. మరో మహిళపై దాడి
Donald Trump | తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.. టేలర్ స్విఫ్ట్‌పై డొనాల్డ్ ట్రంప్
Ganpati Procession | గణపతి ఊరేగింపుపై రాళ్లదాడి.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ, 56 మంది అరెస్ట్