Gourav Vallabh : హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్ రాజకీయ ప్రకంపనలకు కేంద్రబిందువైంది. ఈ రిపోర్ట్ వెల్లడించిన అంశాలపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలకు పదునుపెట్టాయి. అదానీ విదేశీ ఫండ్లలో సెబీ చీఫ్‌తో పాటు ఆమె భర్తకు వాటాలున్నాయని ఈ నివేదిక పేర్కొనడం పెను దుమారం రేపింది. సెబీ చీఫ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తుండగా ఇవి నిరాధార ఆరోపణలని పాలక పక్షం దీటుగా బదులిస్తోంది. భారత మార్కెట్లు పతనం కావాలని కాంగ్రెస్, హిండెన్‌బర్గ్ కోరుకుంటున్నాయని బీజేపీ నేత గౌరవ్ వల్లభ్ ఆరోపించారు.
విపక్షాలు, హిండెన్‌బర్గ్ ఆశలు ఫలించవని, దేశీయ స్టాక్‌మార్కెట్లు, కంపెనీలు పటిష్టంగా ఉన్నాయని అన్నారు. హిండెన్‌బర్గ్ నివేదికపై ఎంత గగ్గోలు పెట్టినా మార్కెట్ కేవలం 0.7 శాతమే పడిపోయిందని చెప్పారు. ప్రధాని మోదీని వ్యతిరేకించే క్రమంలో కాంగ్రెస్, రాహుల్ గాంధీ దేశ ఆర్ధిక వృద్ధినీ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఏం ఒప్పందం చేసుకుందో బయటపెట్టాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చిన కొద్దిక్షణాల్లోనే కాంగ్రెస్ నేతలు ట్వీట్లు చేయడం ఎందుకు మొదలుపెట్టారని ప్రశ్నించారు. అదానీ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేయడం ద్వారా రూ. 122 కోట్లు ఆర్జించినందుకు హిండెన్‌బర్గ్‌కు సెబీ షోకాజ్ నోటీస్ జారీ చేస్తే సమాధానం ఇచ్చేందుకు భయపడుతోందని అన్నారు. భారత ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసి మధ్యతరగతి కలలను చిదిమేసే కుట్రకు తెరలేపారని ఆరోపించారు. సెబీ షోకాజ్ నోటీసుకు సమాధానం చెప్పకుండా మరో రీసెర్చి రిపోర్ట్‌ను రిలీజ్ చేశారని చెప్పారు. భారత ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసే హిండెన్‌బర్గ్ కుట్రకు కాంగ్రెస్ మద్దతిస్తోందని విమర్శించారు.
Read More :
Duvvada Srinivas | నాపై ట్రోల్స్ చేస్తూ మాధురిని బలి చేశారు.. దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన