Kolkata Incident : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు బాధ్యత వహించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. సీఎం మమతా బెనర్జీని విధ్వంసకురాలిగా బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా అభివర్ణించారు.
ఈ హేయమైన ఘటన అనంతరం ఆమె పేరును రాష్ట్ర ప్రజలు నిర్మమతా బెనర్జీగా మార్చేశారని ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ తన చేష్టలతో సమాజానికి సేవ చేసే ఓ యువ డాక్టర్ గౌరవాన్ని మంటగలిపారని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టబద్ధ పాలనకు దీదీ పాతరేశారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేరంలో ఆధారాలను స్వయంగా సీఎం చెరిపివేయడం హేయమని అన్నారు.
దేశ రాజ్యాంగాన్నే ఆమె నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. విద్యార్ధులను కాపాడాల్సిన మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ తన విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారని, అలాంటి వ్యక్తిని సీఎం మమతా బెనర్జీ కాపాడుతున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో మమతా బెనర్జీ విఫలమైందని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగిన ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కారాదని అన్నారు.
Read More :
Sand Art | రాఖీ పౌర్ణమి.. పూరీ తీరంలో ఆకట్టుకుంటున్న సైకత శిల్పం