భోపాల్: ప్రధాని మోదీ ఇంధన వినియోగాన్ని తగ్గించాలని దేశ ప్రజలను కోరిన మర్నాడే మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత ఒకరు దీనిని ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠ్యపుస్తక కార్పొరేషన్ నూతన చైర్మన్‌గా నియమితులైన సౌభాగ్యసింగ్ ఠాకూర్ ఉజ్జయిని నుంచి భోపాల్‌కు 700 వాహనాల భారీ కాన్వాయ్‌తో వెళ్లడం ప్రతిపక్షాల ఆగ్రహానికి కేంద్ర బిందువుగా నిలిచింది.
రహదారిపై భారీగా నిలిచిన ఠాకూర్ వాహనాలు, అతనికి స్వాగతం పలికేందుకు మద్దతుదారులు రోడ్లపై ఆగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉమంగ్ సింఘార్ స్పందిస్తూ ‘సామాన్యుల నుంచి మాత్రమే సంయమనం ఆశిస్తున్నారా?’ అని బీజేపీ నేతను ప్రశ్నించారు. ఇంధనాన్ని ఆదా చేయాలని, ఖర్చులను తగ్గించుకోవాలని సామాన్యులకు చెబుతారు. అధికారంలో ఉన్నవారికి, రాజకీయ నాయకులకు ఇటువంటి నియమాలు వర్తించవా? ఆని నిలదీశారు.