Dimple Yadav : బీజేపీ పాలకులు విచ్ఛిన్నకారులని, వాళ్లు ఎప్పుడూ సమాజంలో విభేదాలు సృష్టించి తమ అధికారాన్ని కాపాడుకుంటారని సమాజ్వాది పార్టీ ఎంపీ (Samajwadi Party MP) డింపుల్ యాదవ్ (Dimple Yadav) విమర్శించారు. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడంలో విఫలం కావడంపై డింపుల్ యాదవ్ స్పందించారు. కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్తో లింకు పెట్టడాన్ని తాము వ్యతిరేకించామని చెప్పారు.
మహిళా రిజర్వేషన్ చట్టసవరణ కోసం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు దళితులకు, ఓబీసీలకు వ్యతిరేకమని డింపుల్ వ్యాఖ్యానించారు. దేశంలోని సగం జనాభాకు సంబంధించిన విషయం కాబట్టి ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని సమాజ్వాదీ పార్టీ డిమాండ్ చేసిందని చెప్పారు. కానీ బీజేపీ పాలకులు ఆ సగం మందిలో కూడా విభేదాలు సృష్టించారని విమర్శించారు.
బీజేపీ పాలకులు విచ్ఛిన్నకారులు అని, వారుఎల్లప్పుడూ స్వార్థం కోసం సమాజంలో విభేదాలను, అపనమ్మకాలను, భయాన్ని సృష్టిస్తారని డింపుల్ విమర్శించారు. వాళ్లు ఆ ఆయుధంతోనే ఏళ్లుగా అధికారంలో కొనసాగుతూ వస్తున్నారని ఆరోపించారు. అయితే ఇప్పుడు వాళ్లు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ప్రజలు ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారని డింపుల్ అన్నారు.