మంగళవారం 19 జనవరి 2021
National - Dec 02, 2020 , 17:51:35

‘అబద్ధాలను ప్రచారం చేయడంలో బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌లు దిట్ట’

‘అబద్ధాలను ప్రచారం చేయడంలో బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌లు దిట్ట’

కోల్‌కతా : అబద్ధాలను ప్రచారం చేయడంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దిట్టలని తృణముల్‌ కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీ సౌగతా రాయ్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తృణముల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సువెందు అధికారి పార్టీకి రాజీమానా చేయగానే బీజేపీలో చేరుతున్నట్లు ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేశారని ఆక్షేపించారు. ‘ 218 మంది శాసనసభ్యుల్లో కేవలం పార్టీని వీడింది ఒక్క ఎమ్మెల్యేనే. ప్రజలంతా తృణముల్‌ కాంగ్రెస్‌తోనే ఉన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలాఉండగా మంగళవారం టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తోపాటు సౌగతా రాయ్..‌ సువెందు అధికారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సువెందు తృణముల్‌ కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని స్పష్టం చేశారని, ఆయన బీజేపీలో చేరే అవకాశమే లేదని సౌగతా రాయ్‌ పేర్కొన్నారు. రెండురోజుల్లో సువెందు మీడియా ఎదుట ఇదే విషయాన్ని స్పష్టం చేస్తారని తెలిపారు. సువెందు పార్టీలోనే కొనసాగుతారని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.