BJP | జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir) అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితాను మళ్లీ రిలీజ్ చేసింది. అంతకు ముందు ఇవాళ ఉదయం 44 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కమలం పార్టీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, అభ్యర్థుల ఎంపికలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అనూహ్యంగా గంటల వ్యవధిలోనే ఆ జాబితాను విత్‌డ్రా చేసుకుంది. ఆ వెంటనే సవరించిన జాబితాను రిలీజ్ చేసింది. తొలి విడత ఎన్నికల కోసం 15 మంది అభ్యర్థులను తాజాగా ప్రకటించింది.
సుమారు పదేండ్ల తర్వాత జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir) అసెంబ్లీకి ఎన్నికలు (assembly elections) జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగనున్న ఎన్నికలు కావడంతో బీజేపీ (BJP) సహా ప్రధాన పార్టీలన్నీ అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ ఇవాళ ఉదయం తొలి జాబితాను కూడా విడుదల చేసింది. అయితే, అనూహ్యంగా యూటర్న్ తీసుకుని.. ఆ జాబితాను విత్‌డ్రా చేసుకుంది.
మూడు విడతల్లో జరగబోయే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 44 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సోమవారం ఉదయం విడుదల చేసింది. సెప్టెంబర్ 18న తొలి విడత ఎన్నికల కోసం 15 మంది అభ్యర్థులను, రెండో దశ (సెప్టెంబర్ 25) కోసం 10 మంది అభ్యర్థులను, మూడో దశ (అక్టోబర్ 1) కోసం 19 మంది అభ్యర్థులను కమలం పార్టీ ప్రకటించింది. అయితే, గంటల వ్యవధిలోనే ఆ జాబితాను ఉపసంహరించుకుంది.
ఆ జాబితాలో ముగ్గురు కీలక అభ్యర్థుల పేర్లు లేకపోవడం చర్చనీయాంశమైంది. జమ్ముకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, మాజీ ఉప ముఖ్యమంత్రులు నిర్మల్ సింగ్, కవీందర్ గుప్తాకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. దీంతో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కమలం పార్టీ తొలి జాబితాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక ఆ వెంటనే సవరించిన కొత్త జాబితాను విడుదల చేసింది. సెప్టెంబర్ 18న తొలి విడత ఎన్నికల కోసం 15 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రకటించింది.
మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, మిగతా రెండు రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, తెలుగు వ్యక్తులైన రామ్ మాధవ్, కిషన్ రెడ్డిలను ఎన్నికల ఇన్చార్జిలుగా బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.
BJP releases amended list of 15 candidates for upcoming J&K Assembly elections pic.twitter.com/yUzU6lYrTB
— ANI (@ANI) August 26, 2024
Also Read..
Ladakh | లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు.. ప్రకటించిన కేంద్రం
Delhi | ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురు మృతి
BJP | జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. 60 నుంచి 70 స్థానాల్లో పోటీచేయనున్న బీజేపీ!