న్యూఢిల్లీ, జనవరి 17: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మాదిరిగా బీజేపీ కూడా శుక్రవారం కొత్త హామీలను ప్రకటించింది. తాము గెలిస్తే గర్భిణులకు రూ.21 వేలు, ప్రతి మహిళా ఓటర్కు ప్రతి నెల రూ.2500, రూ.500కు ఎల్పీజీ సిలిండర్ ఇస్తామని వెల్లడించింది.
60 నుంచి 70 ఏండ్ల వయసు కలిగిన సీనియర్ సిటిజన్లకు రూ.2500, ఆపై వయస్సు కలిగిన వారికి, వితంతువులకు, దివ్యాంగులకు రూ.3 వేలు పింఛను ఇస్తామని తెలిపింది. ఏటా ఒక్కో కుటుంబానికి ఆయుష్మాన్ భారత్ కింద అదనంగా రూ.5 లక్షల ఆరోగ్య బీమా(మొత్తంగా రూ.10 లక్షలు) అందిస్తామని, హోలీ, దీపావళికి ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది.
మురికి వాడల్లో అటల్ క్యాంటీన్లను తెరచి రూ.5 కే పోషకాహార భోజనం అందిస్తామని తెలిపింది. కాగా, తమ మ్యానిఫెస్టోలోని పలు ‘ఉచిత’ హామీలను బీజేపీ కాపీ కొట్టిందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. తాము ఇచ్చిన ఉచిత పథకాలను విమర్శించడం తప్పని ప్రధాని మోదీ ఇప్పటికైనా ఒప్పుకోవాలని అన్నారు.