న్యూఢిల్లీ: వందేమాతరం(Vande Mataram) జాతీయ గీతాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని బీజేపీ ఆరోపించింది. జాతీయ విలువల కన్నా ఇండియా కూటమి ఓటు బ్యాంకు రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు బీజేపీ ఆరోపించింది. ఏప్రిల్ 8వ తేదీన ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశ కార్యక్రమంలో వందేమాతరం గీతాన్ని పాడేందుకు ఇద్దరు కౌన్సిలర్లు వ్యతిరకించారు. వందేమాతరం పాడటాన్ని ఇస్లాం మతం వ్యతిరేకిస్తుందన్నారు. ఆ ఘటనపై ఇవాళ బీజేపీ రియాక్ట్ అయ్యింది. బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా.. ఇండియా బ్లాక్ కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విపక్షాల కూటమి యాంటీ-ఇండియాగా మారిందన్నారు. రాజ్యాంగం కన్నా రాజకీయ అవసరాలకు ఆ పార్టీ అధిక ప్రాధానత్య ఇస్తోందన్నారు.
మున్సిపల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఫౌజియా షేక్ ఆలిమ్, రూబినా ఇక్బాల్.. వందేమాతరం పాడేందుకు నిరాకరించారు. దీనిపై షెహజాద్ పూనావాలా తన ట్విట్టర్లో స్పందిస్తూ ఇది ఇండియా వ్యతిరేక కూటమి అన్నారు. రాజ్యాంగం కన్నా షెరియా చట్టానికి విలువ ఇస్తున్నారన్నారు. వందేమాతరం పాడేందుకు ఇండోర్ నేతలు వ్యతిరేకించారని, వాళ్లు ఒక్కరే కాదు, ఇంకా చాలా మంది ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా వందేమాతరం గీతాన్ని అగౌరవపరిచినట్లు ఆరోపించారు.
మొదటి నుంచి జాతీయ గీతాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు. మధ్యప్రదేశ్లోని అనేక మంది విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా వందేమాతం పాడేందుకు నిరాకరించినట్లు తెలిపారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఇటీవల వందేమాతరాన్ని వ్యతిరేకించారని, ఇప్పుడు కూటమి నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఇలా జరుగుతోందని పూనావాలా తెలిపారు.