హైదరాబాద్, అక్టోబర్ 8: ఎస్టీల రిజర్వేషన్లపై కేంద్రం రెండు నాల్కల ధోరణి తేటతెల్లమైంది. తెలంగాణకు నిరాకరించిన దానిని కర్ణాటకలో అమలు చేస్తామంటూ సరికొత్త నాటకానికి తెరతీసింది. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని ఎంతోకాలం నుంచి మనం కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాం. చూసీచూసీ విసుగు వచ్చి మనమే జీవో జారీ చేసుకున్నాం. ఇన్నాళ్లూ మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని అంటూ కుంటిసాకులు చూపుతూ కేంద్రం నాన్చుడు ధోరణిలో పోయింది. కానీ అసాధారణ పరిస్థితుల్లో దాటొచ్చని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులోనే ఉన్నది.
‘దానిని బట్టే జారీచేసినం.. అవకాశం ఇవ్వండి’ అంటే కేంద్రం మోకాలడ్డు పెడుతున్నది. మరోవైపు బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక కూడా హడావిడిగా ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉపాధిలో రిజర్వేషన్లను పెంచుతూ జీవో జారీచేసింది. విద్య, ఉపాధి కల్పనల్లో రిజర్వేషన్ శాతాన్ని ఎస్సీలకు 15 నుంచి 17కు, ఎస్టీల శాతాన్ని 3 నుంచి 7కు పెంచుతూ కర్ణాటక మంత్రివర్గం అంతకు ముందు నిర్ణయించింది. దీంతో కర్ణాటక మొత్తం రిజర్వేషన్ల శాతం 56కు పెరుగుతుంది.
తెలంగాణలో అది 54% అవుతుంది. దీనికి కేంద్రం ఇస్తానన్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఈడబ్ల్యూఎస్ కోటా కలిపితే కర్ణాటకలో 66 శాతానికి, తెలంగాణలో 64 శాతానికి పెరుగుతాయి. తెలంగాణకు నానుస్తూ వచ్చిన అంశాన్ని కర్ణాటకకు అమలు చేస్తారా? ఇదీ అసలు ప్రశ్న. కానీ లోగుట్టు అంతా ఇక్కడే ఉన్నది. కర్ణాటకలో రిజర్వేషన్ల పెంపు పేరుతో డ్రామాకు తెరతీయడానికి కారణం అక్కడ త్వరలో ఎన్నికలు జరుగుతుండటమే.
ఇన్నేండ్లూ లేని శ్రద్ధ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఎన్నికలకు కొద్దిరోజుల ముందే ఈ ఫైలును ఎందుకు బయటకు తీశారు? ఇది చిత్తశుద్ధితో చేసిందా? లేక ఎన్నికల లబ్ధి కోసం వెంపర్లాటా? ఎవరికి వారు అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక జీవోను వెంటనే అమలు చేయాలి. అలాగే తెలంగాణ జీవో అమలయ్యేలా చూడాలని మనం అంటున్నాం. ఈ విషయంలో రెండో మాట కుదరదని పరిశీలకులు అంటున్నారు. తమిళనాడు తరహాలోనే అసాధారణ కోటా పెంపు కోసం రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతామని కర్ణాటక అంటున్నది.
నాగమోహన్‌దాస్ సిఫారసులతో..
న్యాయమూర్తి నాగమోహన్ దాస్ సమితి సిఫారసుల ప్రకారం విద్య, ఉపాధి కల్పనల్లో రిజర్వేషన్ శాతాన్ని ఎస్సీలకు 15 నుంచి 17కి , ఎస్టీల శాతాన్ని 3 నుంచి 7కు పెంచుతూ కర్ణాటక మంత్రివర్గం తీర్మానించింది. ఈ మేరకు 2, 3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్టు కర్ణాటక న్యాయశాఖ మంత్రి మాధుస్వామి తెలిపారు. ఇతర సామాజిక వర్గాల రిజర్వేషన్ల డిమాండును నెరవేర్చిన తర్వాత రాజ్యాంగ సవరణకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
పంచమసాలీల డిమాండ్
ఇతర వెనుకబడిన వర్గాలకు కేటాయించిన 32% రిజర్వేషన్లో లింగాయతుల వాటా నాలుగు శాతం (3బీ). వారిలో 42 ఉపకులాలు ఉన్నాయి. వీటిలో పంచమసాలి ఒకటి. గత మూడేండ్లుగా వీరు తమను 3బీ క్యాటగిరీ నుంచి తొలగించి 2ఏ క్యాటగిరీలోకి మార్చాలని డిమాండు చేస్తున్నారు. రిజర్వేషన్లో ఎకువ వాటా పొందటమే దీని ఆంతర్యం. ఉత్తర కర్ణాటకలో ప్రముఖ బీజేపీ నేతల్లో ఒకరైన కేంద్ర మాజీమంత్రి, తిరుగుబాటు నాయకుడు బసవరాజ పాటిల్ యత్నాళ్ ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. ప్రస్తుతం 2ఏ క్యాటగిరీలో కురుబ, ఈడిగ, రజకులు తదితర 102 కులాలవారున్నారు. వారి రిజర్వేషన్ 15%. పంచమసాలి డిమాండును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరాదని కురబ, ఈడిగలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నిర్ణాయక పాత్రలో పంచమసాలీలు
బెళగావి, విజయపుర, బాగలకోట, హుబ్బళ్లి- ధార్వాడ తదితర ప్రాంతాల్లో పంచమసాలీలూ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపులో నిర్ణాయక పాత్ర వహిస్తున్నారు. వీరిలో అత్యధికులు బీజేపీ కార్యకర్తలు, సానుభూతి పరులు. ఇది బీజేపీకి సంకటంగా మారింది. ఎస్సీ, ఎస్టీల డిమాండ్ ఈడేరినందున తమ పోరాటాన్ని ముమ్మరం చేయనున్నట్టు పంచమసాలి వర్గాలు తెలిపాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పెంపునకు అనుగుణంగా పదోన్నతుల్ని పెంచాలని వచ్చేవారం సీఎంకు విన్నవిస్తామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు చెప్పారు. రిజర్వేషన్ల వ్యవహారం బొమ్మై ప్రభుత్వానికి , కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారింది. ఎన్నికల వేళ రిజర్వేషన్ల విషయంలో ప్రజల డిమాండ్లను ఈడేర్చక పోతే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి చేకూరదనే చింత వారికి పట్టుకుంది.
తెలంగాణలో..
తెలంగాణలో ఎస్టీల రిజర్వేషన్ శాతాన్ని ఆరు నుంచి పదికి పెంచటంతో రిజర్వేషన్ శాతం 54కి చేరింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఈ వర్గానికి రిజర్వేషన్ శాతం ఆరు మాత్రమే. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణను యూనిట్‌గా తీసుకోవడం వల్ల ఎస్టీల జనాభాకు అనుగుణంగా మరో నాలుగు శాతం రిజర్వేషన్ పెంచాలని 2017లో శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఐదేండ్లు గడచినా ఇప్పటివరకు ఆ తీర్మానం అతీగతీ లేదు. కేంద్రం నిర్ణయాలతో నిమిత్తం లేకుండా రిజర్వేషన్ పెంపును అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల గిరిజన భవన్ ప్రారంభోత్సం సందర్భంగా ప్రకటించారు. తమిళనాడులో రిజర్వేషన్లు 69%. దీనికి పార్లమెంటు అనుమతించింది కూడా. అక్కడ 69 శాతానికి అనుమతించిన కేంద్రం తెలంగాణలో రిజర్వేషన్ల పెంపునకు ఎందుకు ఆమోదించడం లేదని తెలంగాణ రాష్ట్రం కేంద్రాన్ని నిలదీస్తున్నది. కాగా కర్ణాటక బీజేపీ పాలిత రాష్ట్రం కావడంతో అక్కడి పెంపుపై కేంద్రం స్పందన కోసం తెలంగాణ వేచి చూస్తున్నది.
ఎదురుతిరుగుతున్న కోటా ఆట
విద్యా, ఉపాధి కల్పనలో రిజర్వేషన్ల శాతం పెంపునకు అనుమతించటంలో కేంద్రం బీజేపీ, బీజేపీయేతర ప్రభుత్వాల పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శిస్తుందా? లేక నిష్పక్ష పాతంగా వ్యవహరిస్తుందా? అనేది త్వరలోనే తేలిపోనున్నది. కేంద్రంలో ఉన్నది తమ బీజేపీ ప్రభుత్వమే కావడంతో పెంచిన రిజర్వేషన్లకు కేంద్రం నుంచి ఎలాంటి సమస్య ఉండదని కర్ణాటక ప్రభుత్వం గాంభీర్యం ప్రదర్శిస్తున్నది. కానీ ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఎస్టీల జనాభాకు అనుగుణంగా పెంచిన రిజర్వేషన్ల పట్ల కేంద్రం నుంచి ఉలుకు-పలుకు లేదు. తెలంగాణలో బీజేపీయేతర ప్రభుత్వం ఉండటం వల్లనే కేంద్రం స్పందించడం లేదా?