Madhya Pradesh | భోపాల్, అక్టోబర్ 18: మధ్యప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ర్టాన్ని ఏలుతున్న బీజేపీకి, ఈసారి సొంతపార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. బీజేపీ రాష్ట్రశాఖ ఎప్పుడైనా ముక్కలయ్యేలా ఉండటంతో 15 ఏండ్లలో తొలిసారి ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా గోప్యత పాటిస్తున్నది. అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు నెల ముందుగానే తమ సీఎం అభ్యర్థిగా కమల్‌నాథ్‌ను ప్రకటించి, ఎన్నికల్లో పార్టీని గెలిపించే పూర్తి బాధ్యతను ఆయన చేతుల్లో పెట్టింది. ఎప్పుడూ సీల్డు కవర్లో సీఎంలను ప్రకటించే ఆ పార్టీ, అందుకు విరుద్ధంగా ఈసారి ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది.
భయంలో బీజేపీ
మధ్యప్రదేశ్‌లో 2003 నుంచి బీజేపీనే అధికారంలో ఉన్నది. 2018లో కాంగ్రెస్ గెలిచినా ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకొన్నది. 2003 ఎన్నికల్లో తొలిసారి బీజేపీ తన సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్‌గా ముద్ర పడిన ఉమాభారతిని ప్రకటించింది. సీఎం అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటించి సానుకూల ఫలితం రాబట్టింది. ఆ తర్వాత 2008, 2013, 2018లో శివరాజ్సింగ్ను సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు ముందే ప్రకటించింది. అంతేకాదు.. అభ్యర్థుల ఎంపికలోనూ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. మొదటి రెండు పర్యాయాలు పార్టీని విజయతీరాలకు చేర్చిన ఆయన, 2018లో మాత్రం విఫలమయ్యారు. అయినా, కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి మళ్లీ సీఎం అయ్యారు. అయితే, పార్టీ అధిష్ఠానం ఈసారి వ్యూహం మార్చింది. వచ్చే నెల 17న జరిగే ఎన్నికలకు ఆ పార్టీ ఇప్పటివరకు సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. అంటే ఒకవేళ బీజేపీ గెలిచినా ప్రస్తుత సీఎం శివరాజ్‌సింగ్‌కు మరోసారి అవకాశం గ్యారెంటీ కాదని సంకేతాలిచ్చింది. ఒకవేళ ఈసారి బీజేపీ గెలిస్తే సీఎం అభ్యర్థిగా కేంద్రమంత్రి కైలాశ్ విజయ్వర్గియాకు సీఎం అయ్యే అవకాశం రావచ్చని పేర్కొంటున్నారు.
వ్యూహం మార్చిన కాంగ్రెస్
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అధిష్ఠానం సీల్డు కవర్లో సీఎం అభ్యర్థి పేరును పంపటం ఆనవాయితీ. అందుకే కాంగ్రెస్ సీఎంలను సీల్డు కవర్ సీఎంలు అంటారు. అన్నిస్థాయిలో పార్టీపై పట్టు సడలకుండా చూసుకొనేందుకు అధిష్ఠానం ఈ విధానాన్ని అనుసరించేది. కానీ, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి వ్యూహం మార్చింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే గాంధీల కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కమల్‌నాథ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. 2018లో కూడా ఆయనే సీఎం అయ్యారు. కానీ, సింధియా తిరుగుబాటు చేసి బీజేపీలో చేరటంతో కమల్‌నాథ్ అధికారం మూణ్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఈసారి కూడా కాంగ్రెస్ ఆయనపైనే నమ్మకం పెట్టుకొన్నది. ఒక్క మధ్యప్రదేశ్‌లో మాత్రమే సీఎం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ సహా మిగతా ఎన్నికల రాష్ర్టాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం.