న్యూఢిల్లీ, మే 4: దేశంలో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు ప్రతి చోటా కమలం వికసించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంప్రదాయ బెంగాలీ తరహా ధోతి ధరించి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉత్సాహంగా హాజరైన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్.. నేడు పశ్చిమ బెంగాల్‌లలో బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చాయన్నారు.
జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ముఖర్జీ జన్మించిన బెంగాల్లో విజయంతో బీజేపీ కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. బెంగాల్లో గాలి మారిందని, అందుకే బెంగాల్ ప్రజలు బీజేపీకి అవకాశం కల్పించారని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి బెంగాల్ ప్రజలు ఎలాంటి భయం లేకుండా ఉండవచ్చునని, రాష్ట్రం పూర్తి విశ్వాసంతో అభివృద్ధి పథంలో నడుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. గత పాలనలో పలువురు బీజేపీ మహిళా కార్యకర్తలు తీవ్ర వేధింపులను ఎదుర్కొన్నారని ఆరోపించారు.