అంబేద్కర్‌ను అవమానించారని ఇండియా-ఎన్డీయే కూటమి సభ్యులు పరస్పరం ఆరోపించుకుంటూ గురువారం పార్లమెంటు ప్రాంగణంలో నిరసనలకు దిగారు. ఈ క్రమంలో మకరద్వారం వద్ద ఇండియా, ఎన్డీయే కూటముల ఎంపీలు ఎదురుపడటంతో తోపులాట చోటుచేసుకున్నది. ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. రాహుల్‌గాంధీ తోయడంతోనే ఎంపీలు గాయపడ్డారని బీజేపీ ఆరోపించింది. రాహుల్‌పై పోలీసు కేసు నమోదైంది. బీజేపీ ఎంపీలే తమను తోసేశారని కాంగ్రెస్ ఆరోపించింది.
Parliament | న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు ప్రాంగణం ఇండియా – ఎన్డీఏ ఎంపీల కొట్లాటకు వేదికైంది. ఇంతకాలం సభ లోపల వాగ్వాదాలకు పరిమితమైన ఇరు పార్టీల ఎంపీలు గురువారం సభ బయట బాహాబాహికి దిగారు. ఈ ఘటన పార్లమెంటు ప్రాంగణంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. అంబేద్కర్‌ను ఉద్దేశించి పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఈ వివాదం మొదలయ్యింది. అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్‌ను అవమానించడమేనని ఆరోపిస్తూ గురువారం ఉదయం పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ సహా ఇండియా కూటమి ఎంపీలు నీలం రంగు దుస్తులు ధరించి, ప్లకార్డులు పట్టుకొని, నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్‌ను అవమానించిందని ఆరోపిస్తూ బీజేపీతో పాటు ఎన్డీఏ ఎంపీలు సైతం ఆందోళనకు దిగారు. పార్లమెంటు మకరద్వారం వద్ద ఇరు పక్షాల ఎంపీలు ఎదురుపడి, పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. దీంతో ఇరు పక్షాల ఎంపీల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒడిశాలోని బాలాసోర్ ఎంపీ ప్రతాప్‌చంద్ర సారంగి(59)కి నుదుటి ఎడమ భాగంలో గాయమైంది. మరో బీజేపీ ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్ కూడా గాయపడ్డారు.
గాయపడిన ప్రతాప్‌చంద్ర సారంగి వద్దకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా ‘సిగ్గు లేదా రాహుల్.. రౌడీయిజం చేస్తున్నావు’ అంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ నెట్టేయడం వల్ల తమ ఎంపీలకు గాయాలయ్యాయని ఆయన ఆరోపించారు. దవాఖానకు తరలించేటప్పుడు ఎంపీ సారంగి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను మెట్ల వద్ద ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేయగా, ఆయన నాపైన పడటంతో నేను కింద పడ్డాను’ అని పేర్కొన్నారు. కాగా, రాహుల్ వైఖరి వల్ల అసౌకర్యానికి గురయ్యానని నాగాలాండ్ బీజేపీ మహిళా ఎంపీ ఫాంగ్నాన్ కొన్యక్ ఆరోపించారు. ‘నేను పార్లమెంటు బయట శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే రాహుల్ గాంధీ నాకు అతి సమీపంగా వచ్చి నిలబడటంతో నేను అసౌకర్యానికి గురయ్యారు. తర్వాత రాహుల్ నాపైకి గట్టిగా అరవడం ప్రారంభించారు’ అని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు బీజేపీ ఎంపీలు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను తోసేశారని, రాహుల్ గాంధీపై చేయిచేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ ఎంపీలు నెట్టేయడం వల్ల తాను కింద పడ్డానని, దీంతో మోకాలి గాయాలు తీవ్రమయ్యాయయని, శస్త్రచికిత్స అవసరం అవుతుందని ఖర్గే ఆరోపించారు. తనపై దాడి ఘటనపై విచారణకు ఆదేశించాలని లోక్‌సభ స్పీకర్‌కు ఆయన లేఖ రాశారు. ‘పార్లమెంటులోకి వెళ్తుంటే బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకున్నారు. తోసేసి, బెదిరించారు. అసలు అంశం ఏంటంటే.. బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నది. అంబేద్కర్‌ను అవమానిస్తున్నది’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ ఎంపీలే తమ ఎంపీలను అడ్డుకున్నారని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ పలు వీడియోలను విడుదల చేసింది. ఇదంతా అమిత్ షాను కాపాడేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఆరోపించారు.
పార్లమెంటు ఘటనలపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఎంపీలపై బీజేపీ బృందం డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా రాహుల్‌పై కేసు నమోదైంది. బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ బృందం ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం పార్లమెంటు ఉభయ సభల్లో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. ఇరు సభలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరు సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.