Anantkumar Hegde | కర్వార్, మార్చి 10: భారత రాజ్యాంగం మార్పుపై కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పీఠికలో ‘లౌకిక’ అనే పదాన్ని తొలగిస్తామని గతంలో వ్యాఖ్యానించిన అనంత్‌కుమార్.. హిందువులకు అనుకూలంగా దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తామని తాజాగా పేర్కొన్నారు. ఇందుకోసం బీజేపీకి లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీ ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. కర్వార్‌లో జరిగిన ఓ సభలో ఎంపీ అనంత్‌కుమార్ మాట్లాడుతూ ‘ ఇదంతా జరుగాలంటే మోదీకి లోక్‌సభలో అధిక సీట్లు ఇవ్వాలి.
బీజేపీకి లోక్‌సభ, రాజ్యసభలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల్లో 2/3 వంతుల మెజార్టీ ఉండాలి’ అని పేర్కొన్నారు. ప్రధానంగా హిందూ సమాజాన్ని అణచివేసే లక్ష్యంతో పలు చట్టాలను తీసుకొచ్చిందని, ఇదంతా మారాలంటే ప్రస్తుతం ఉన్న మెజార్టీతో సాధ్యం కాదని అన్నారు.రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 కంటే ఎక్కువ సీట్లు గెలువడం ద్వారా, అది రాజ్యసభలో కూడా 2/3 మెజార్టీ సాధించేందుకు, అదే స్థాయిలో రాష్ర్టాల్లో అధికారం చేపట్టేందుకు ఉపకరిస్తుందని ఎంపీ అనంత్‌కుమార్ పేర్కొన్నారు.
సీఏఏను దేశంలో అమలు చేసేందుకు కూడా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలువాల్సిన అవసరం ఉన్నదని ఎంపీ అన్నారు. లోక్‌సభలో సులభంగానే ఆమోదం పొందిన సీఏఏ బిల్లు.. రాజ్యసభలో ఆమోదం పొందేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒక సవరణ ద్వారా సీఏఏను అమలు చేయాలనే ప్రణాళికలో ఉన్నదని తెలిపారు.
ప్రస్తుత రాజ్యాంగాన్ని నాశనం చేసి, తిరిగి రాయాలనే బీజేపీ-ఆరెస్సెస్ దాచిపెట్టిన, మోసపూరిత అజెండా బయటపడిందని కాంగ్రెస్ విమర్శించింది. బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే వ్యాఖ్యలు ప్రధాని మోదీ, సంఘ్ పరివార్ ‘అంతర్గత ఉద్దేశాన్ని’ బహిరంగ పరిచిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో రహస్యంగా నియంతృత్వాన్ని అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం, బీజేపీ, ఆరెస్సెస్ ప్లాన్ వేశాయని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.
రాజ్యాంగం మార్పుపై ఎంపీ హెగ్డే వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. అది అతని వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీ వైఖరిని ప్రతిబింబించబోదని కర్ణాటక బీజేపీ శాఖ ఎక్స్ పోస్టులో పేర్కొన్నది. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై హేగ్డే వివరణ కోరినట్టు తెలిపింది.