Manipur Violence | న్యూఢిల్లీ : మణిపూర్‌లో చెలరేగుతున్న హింస కేవలం శాంతిభద్రతల సమస్య కాదని, దీని వెనుక భారీ కుట్ర ఉన్నదని ఆ రాష్ట్ర అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే పోలిన్‌లాల్ హోకిప్ తెలిపారు. హింస మొదలైనప్పుడే సమస్యను చెప్పుకొనేందుకు ప్రధాని అపాయింట్మెంట్ అడిగామని, ఇప్పటికీ కలిసేందుకు ఆయన ఒప్పుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హింసకు మైతీ మిలీషియాతోపాటు పోలీసులూ కారణమని విమర్శించారు. మణిపూర్‌లో ఏం జరుగుతున్నదో ప్రధానికిగానీ, కేంద్ర హోంమంత్రికి గానీ తెలియదని ఓ మీడియా సంస్థకు ఆయన తెలిపారు.
కుకీలపై మైతీ మిలీషియా గ్యాంగులతోపాటు పోలీసులు కూడా దాడులు చేస్తున్నారని హోకిప్ వెల్లడించారు. మైతీ మిలీషియా, పోలీసులు కలిసే తిరుగుతున్నారని, ఉమ్మడిగానే మారణ కాండకు పాల్పడుతున్నారని చెప్పారు. ‘మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బయటకు రాకుంటే ప్రధాని మణిపూర్ హింసపై అసలు మాట్లాడేవారే కాదు. సీఎం బీరేన్‌సింగ్ ఆ పదవికి అర్హుడు కాదు. ఇది మానవ హక్కుల సమస్య. తీవ్రమైన రాజకీయ సంక్షోభమిది. ఇందులో సైన్యం కూడా ప్రేక్షక పాత్రే పోషిస్తున్నది. మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయింది. కుకీలకు ప్రత్యేక పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేయటమే ఈ సమస్యకు పరిష్కారం. ప్రజలు ఎన్నుకున్న నాలాంటి ఎమ్మెల్యేల ప్రాణాలకే ఇక్కడ గ్యారెంటీ లేదు. అసెంబ్లీకి వెళ్లటానికే నాకు భయంగా ఉన్నది’ అని కుకీ వర్గానికి చెందిన ఈ బీజేపీ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు.